హైదరాబాద్ తో పాటు 13 రాష్ట్రాల్లో జింకా వైరస్ కేసులు 

హైదరాబాద్ తో పాటు 13 రాష్ట్రాల్లో జింకా వైరస్ కేసులు 
దేశంలో ఒక వంక కరోనా కేసులు పెరుగుతుండగా, మరోవంక ప్రజలను జికా వైరస్‌ భయాలు కూడా వెంటాడుతున్నాయి. తెలంగాణతో పాటు దేశంలోని 13 రాష్ట్రాల్లో జికా వైరస్‌ కేసులు వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తాజా పరిశోధనలో తేలింది. పలు రాష్ట్రాల్లో జికా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోందని, జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. మొత్తం 1475 నమూనాలను పరిశీలించగా వాటిలో 67 నమూనాల్లో జికా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.
పాజిటివ్‌ వచ్చిన వారిలో 86శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉండగా 13శాతం మంది ఆసుపత్రిలో చేరినట్లు గుర్తించారు. జికా వైరస్‌ తెలంగాణతోపాటు ఢిల్లి, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్నట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. తెలంగాణలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో సేకరించిన ఓ నమూనాలో జికా వైరస్‌ నిర్ధారణ అయింది. ఉస్మానియా మెడికల్‌ కాలేజీతోపాటు హైదరాబాద్‌లోనూ ఈ తరహా కేసులు నమోదైనట్లు సమాచారం.
జికా వైరస్‌ ప్రధానంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధి. ఈ వైరస్‌ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, శరీరంపై దుద్దుర్లు, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు బహిర్గతమవుతాయి. జికా కూడా డెంగీ లానే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐసీఎంఆర్‌ హెచ్చరించింది. గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసిందది. జికాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన పరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తల్లి నుంచి బిడ్డకు సోకి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మానసికంగా చిన్నారులను బలహీనం చేసే శక్తి జికాకు ఉందని హెచ్చరించారు. అయితే జికాకు ఇప్పటి వరకు నిర్ధిష్టమైన చికిత్స విధానం లేకపోవడంతో వైరల్‌ జలుబుకు ఇచ్చిన చికిత్సనే జికా కేసులకు చేస్తున్నారు. జికా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి రాలేదు.
 
రెండో-బూస్టర్ డోస్ ల వ్యవధి తగ్గింపు

ఇలా ఉండగా, దేశంలో కరోనా నాలుగో వేవ్  సంకేతాలు వెలువడుతూ ఉండడం, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా టీకాల రెండో డోస్‌, బూస్ట‌ర్ డోస్ మ‌ధ్య వ్యవధిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. డోసుల మధ్య వ్యవధిని ఆరు నెల‌ల‌కు త‌గ్గించింది.రెండో డోస్‌, బూస్ట‌ర్ డోస్ మ‌ధ్య వ్య‌వ‌ధిని త‌గ్గించాల‌ని వ్యాక్సినేష‌న్‌పై స‌ల‌హా మండ‌లి నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్ సూచించింది.

దేశంలో నాలుగో వేవ్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుండడం, పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణ‍యం తీసుకుంది. ప్రస్తుతం రెండో డోస్‌కు, బూస్ట‌ర్ డోస్‌కు మధ్య 9 నెలల వ్యవధి ఉంది. ఈ వ్యవధిని తాజాగా 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా, 18-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు రెండో డోస్ తీసుకున్న ఆరు నెల‌లు లేదా 26 వారాల త‌ర్వాత ప్రికాష‌న్ డోసు తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, నిర్వాహకులకు లేఖ ద్వారా తెలిపారు.