రాజ్యాంగంపై విమర్శలు గుప్పించిన కేరళ మంత్రి రాజీనామా

భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజీ చెరియన్‌ తన పదవికి రాజీనామా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారంటూ ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో రాజకీయ ఒత్తిళ్ల మేరకు.. బుధవారం సాయంత్రం కేబినెట్‌ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని సాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. చెరియన్‌ కామెంట్లపై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు.

మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. రాజ్యాంగం గురించి తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని, తాను రాజ్యాంగాన్ని కించపరచలేదని అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. 

తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు.

చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి. భారత రాజ్యాంగాన్ని విమర్శించిన కేరళ మంత్రి, సీపీఎం నేత సాజి చెరియన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్‌ను బీజేపీ డిమాండ్ చేసింది. మల్లపల్లిలో ప్రతి వారం నిర్వహించే రాజకీయ వ్యాఖ్యాన కార్యక్రమం 100వ ఎపిసోడ్‌లో సాజి రాజ్యాంగాన్ని విమర్శించారని ఆరోపించింది. 

గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్ రాసిన లేఖలో, సాజి చెరియన్ తన వ్యాఖ్యల ద్వారా మన దేశ రాజ్యాంగాన్ని, దాని నిర్మాతలను కించపరిచారని, అవమానించారని ఆరోపించారు. భారతీయులందరి హక్కులను పరిరక్షించేవిధంగా, అందరినీ కలుపుకునిపోయే విధంగా, అందరికీ వర్తించే విధంగా ఎంతో శ్రమతో దీనిని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కూడా సాజి అవమానించారని పేర్కొన్నారు.

మన దేశ పునాదులను ధ్వంసం చేసే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఇది ఓ ఎమ్మెల్యే హోదాకు తగదని, అంతేకాకుండా రాజ్యాంగాన్ని బలపరచవలసిన మంత్రికి కూడా తగదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సాజి చెరియన్‌ను తక్షణమే కేరళ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సాజి చెరియన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీశన్ కూడా డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.