పాక్ ఉగ్రవాద కుట్రను బట్టబయలు చేసిన భారత్ సైన్యం

భారతదేశాన్ని రక్తమోడించాలనే లక్ష్యంతో ఉగ్రవాద కుట్రలను పన్నుతున్న పాకిస్థాన్ దుష్ట ప్రయత్నాలను భారత సైన్యం బయటపెట్టింది. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం కలిసి భారత దేశంలోకి ఏ విధంగా చొరబాట్లకు పాల్పడుతున్నదీ, పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులను ఏ విధంగా హత్య చేస్తున్నదీ వివరించింది.

జమ్మూ-కశ్మీరులో పోలీసులు, టీచర్లు, వలస కూలీల హత్యలకు పాక్ మద్దతుగల ఉగ్రవాదులు ఏ విధంగా పాల్పడుతున్నదీ తెలిపింది. ఈ వివరాలన్నిటితో ఓ నివేదికను రూపొందించింది. పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదులు ఇస్లామాబాద్‌లోని రక్షణ దళాలకు ప్రత్యక్ష ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని, వీరు జమ్మూ-కశ్మీరులో పోలీసులు, టీచర్లు, వలస కూలీలను హత్యచేస్తున్నారని ఈ నివేదిక తెలిపింది.

జమ్మూ-కశ్మీరులో రాజకీయ నేతల హత్యలు, ఉగ్రవాదంలోకి చేరే విధంగా యువతకు బ్రెయిన్‌వాష్ చేయడం వంటి అంశాలను కూడా వివరించింది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి, మారుమూల ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద సంఘటనలను ఈ నివేదికలో ప్రస్తావించింది.

2020-2021 మధ్య కాలంలో పాకిస్థానీ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు 16 సార్లు ప్రయత్నించారని తెలిపింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఏయే ప్రాంతాల నుంచి వీరు ఈ ప్రయత్నాలు చేశారో తెలిపింది. ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు వారి నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆయుధాల గురించి కూడా వివరించింది.

జమ్మూ-కశ్మీరులో డబ్బు, ఉపాధి అవసరం ఉన్న యువతను గుర్తించి, వారి మనసుల్లో విషం నింపుతున్నట్లు, జీహాద్‌ యుద్ధంలో పాల్గొనేలా ప్రేరేపిస్తున్నట్లు  వెల్లడించింది. పాకిస్థాన్ గడ్డపై నుంచి ఈ ఉగ్రవాద యంత్రాంగం పని చేస్తున్నట్లు తెలిపింది.

ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లకు తెలియజేస్తున్నట్లు వివరిస్తూ, కొన్ని సంభాషణలను కూడా ఈ నివేదికకు జత చేసింది.  జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదులు తమ పంథాను మార్చినట్లు తెలిపింది.

సామాన్య ప్రజానీకంలో భయాందోళనలు పెరిగేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొంది. ఈ ప్రాంతంలో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవని ప్రచారం చేస్తున్నారని వివరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మద్దతుగల జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాద సంస్థలు స్థానికంగా అసంతృప్తిని రగిలించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

జమ్మూ-కశ్మీరులో ఈ ఏడాది మార్చి నుంచి హింసాత్మక సంఘటనలు పెరిగినట్లు తెలిపింది. హిందువులు, సిక్కులు వంటి మతపరమైన మైనారిటీలపై దాడులు పెరిగాయని పేర్కొంది.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2019 ఆగస్టు 5న అధికరణ 370ని రద్దు చేసిన తర్వాత  జమ్మూ-కశ్మీరులో జరిగిన ఉగ్రవాద సంఘటనల్లో 87 మంది సాధారణ పౌరులు హత్యకు గురయ్యారు. అంతకుముందు ఐదేళ్ళలో 177 మంది సాధారణ పౌరులు హత్యకు గురయ్యారు. ఉగ్రవాద దాడుల బాధితుల్లో మహిళలు, బాలలు కూడా ఉన్నారు.