బ్రిటన్‌లో ఇద్దరు కీలక మంత్రుల రాజీనామా

బ్రిటన్‌లో బోరిస్‌ జాన్సస్‌ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఆయన క్యాబినేట్‌లోని కీలక మంత్రులిద్దరు నిమిషాల వ్యవధిలో తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్థిక మంత్రి రిషి సునాక్‌, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. బోరిస్ నేతృత్వంలోని స‌ర్కార్ స‌రైన రీతిలో న‌డ‌వ‌డం లేద‌ని ఆ ఇద్ద‌రూ ఆరోపించారు. 
 
ఇద్ద‌రు కీల‌క మంత్రుల రాజీనామా నేప‌థ్యంలో ప్ర‌ధాని బోరిస్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కం మారింది. బోరిస్‌ ప్రభుత్వంలోని సీనియర్‌ సభ్యుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన మాట మార్చిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం రిషి సునక్‌ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధం, ఇతర తీవ్రమైన సవాళ్లతో ప్రపంచం అతలాకుతలమైతున్న సమయంలో.. నేను ఛాన్సలర్‌గా వైదొలగడం తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు’ అని చెప్పారు.
 
`ప్రభుత్వ పాలన సమర్థవంతంగా సాగించాలని ప్రజలు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఇది నా చివరి మంత్రి పదవి అని నేను భావించాను. కానీ కొన్ని ప్రమాణాల కోసం పోరాడాల్సి ఉంది. అందుకే ఈ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొంటూ రాజీనామా లేఖను జత చేశారు. 
 
అదేవిధంగా సాజిద్‌ జావేద్‌ కూడా తాను రాజీనామా చేసే విషయంపై ప్రధాని బోరిస్‌తో మాట్లాడానని, హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం గొప్ప అదృష్టమని పేర్కొంటూ ఈ పదవిలో ఇక కొనసాగలేనని ట్వీట్‌ చేశారు. ఇప్పటికే పలు కుంభకోణాలతో అనిశ్చితిని ఎదుర్కొంటున్న బోరిస్‌ ప్రభుత్వానికి కీలక మంత్రుల రాజీనామా పెద్ద ఎదురుదెబ్బగా తెలుస్తోంది.
 
లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యుడు క్రిస్ పిన్చర్‌పై జాన్సన్ మాటలు  మారుస్తున్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. జులై 30న లండన్ క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులను మద్యం మత్తులో పట్టుకున్నారనే ఆరోపణలతో పించర్ ప్రభుత్వ విప్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

జాన్సన్‌కు తాజా సంక్షోభం ‘పార్టీగేట్’ వివాదంతో అవిశ్వాస తీర్మానం నుండి బయటపడటం,  అతని పార్టీకి రెండు ఉపఎన్నికల పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత ఈ  సమస్య ఎదురైనది.  జాన్సన్ 2019లో పించర్‌కు వ్యతిరేకంగా లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చెలరేగినా వ్యవహరించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యను పరిష్కరించడం గాని, తగు చర్య తీసుకోవడం గాని చేయలేదని చెబుతున్నారు.