శ్రీలంకలో వారం పాటు స్కూళ్ల మూసివేత

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత వేధిస్తున్నది. రేషన్‌ విధానంలో పెట్రోల్‌, డీజిల్‌ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతున్నది.
 
 దీంతో శ్రీలంక ప్రభుత్వం వారం రోజులపాటు బడులను మూసివేయాలని నిర్ణయించింది. రాజధాని కొలంబోతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బడులను నేటి నుంచి వారంపాటు తెరవద్దని అధికారులను ఆదేశించింది.
చేతిలో డబ్బు లేకపోవడంతో పెట్రోల్, డీజిల్‌ దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్‌ బంకుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.  విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతులకు వచ్చే వీలు లేకపోవడంతో పాఠశాలలను మరో వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు శ్రీలంక విద్యా శాఖ స్పష్టం చేసింది. విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని స్కూళ్ల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సూచించారు.
 
 గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని, అయితే ట్రాన్స్‌పోర్టేషన్‌తో సంబంధం లేని విద్యార్థులనే బడులకు అనుమతించాలని చెప్పారు. చమురు సంక్షోభంతో జూన్‌ 18 నుంచి వారం రోజుల పాటు దేశంలో స్కూళ్లను ప్రభుత్వం బంద్‌ చేసింది. 
 
విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకుగాను ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలాంటి విద్యుత్‌ కోతలు ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుతం దేశంలో పరిమితంగా అందుబాటులో ఉన్న చమురును కేవలం కొన్ని అవసరాలకే విక్రయిస్తున్నారు. ఆరోగ్య సేవలు, ఓడరేవుల కార్మికులు, ప్రజా రవాణాకు, ఆహారం పంపిణీకి మాత్రమే చమురు లభిస్తోంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకకు క్రెడిట్‌పై చమురు విక్రయించేందుకు ఆయిల్‌ కంపెనీలు ఇష్టపడడం లేదు.

నగదు లభించడం పెద్ద సవాలుగా మారిపోయిందని శ్రీలంక విద్యుత్, చమురు శాఖ మంత్రి కాంచన విజేశేఖర చెప్పారు. ఏడు చమురు కంపెనీలకు 800 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉందన్నారు. చమురు కొనేందుకు బ్యాంకుల ద్వారా నగదు పంపించాలని విదేశాల్లోని లంకేయులకు విజ్ఞప్తి చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన (1948) తర్వాత శ్రీలంక ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటి సారి.