భారత్ తేజస్ యుద్ధ విమానాల వైపే మలేసియా మొగ్గు 

యుద్ధ విమానాల సరఫరాకు పలు దేశాలు ముందుకొస్తున్నప్పటికీ,  భారత దేశపు ప్రతిష్టాత్మక తేజస్ యుద్ధ విమానాల  వైపే మలేసియా మొగ్గుచూపుతున్నది.  తమ దేశ రక్షణలో ఫైటర్ శ్రేణులలో వీటిని కీలకంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
 తేజస్ తేలికపాటి యుద్ధ విమానం శక్తి సామర్థాలతో ఈ ఆగ్నేయాసియా దేశం ఈ విమానాలను భారత్ నుంచి సమీకరించుకునే దిశలో చర్చలు చేపట్టింది.  ఉభయ దేశాల మధ్య సంప్రదింపులు కీలక దశకు చేరాయి.  సుమారు 18 తేజస్‌లను సరఫరా చేసే ఒప్పందం  తుది దశకు చేరుకుంది. 
ఇప్పటి వరకు తమ సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న పాతకాలపు యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజస్ ఫైటర్లను ప్రవేశపెట్టడం ద్వారా శక్తివంతం కావాలని మలేసియా యోచిస్తోంది. తేలికపాటి యుద్ధ విమానాలను సరఫరా చేయడంతోపాటు వాటి నిర్వహణ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన నిపుణులను నిరంతరం అందుబాటులో ఉంచేందుకు మంచి ప్యాకేజీని భారత్‌ ఆఫర్‌ చేసింది.
యుద్ధ విమానాలకు సంబంధించి మలేసియాకు చైనా నుంచి జెఎఫ్ 17 జెట్స్, దక్షిణ కొరియా ఎఫ్‌ఎ 50, రష్యా మిగ్ 35, యాక్ 130 ఫైటర్ల విక్రయాలపై భారీ స్థాయిలో బేరసారాల సంప్రదింపులు వివిధ సందర్భాల్లో సాగాయి.  ఈ ఆఫర్లన్నింటిని పక్కకు పెట్టి భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానాల పట్ల మలేసియా ఎక్కువగా మొగ్గు చూపిందని హిందూస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మాధవన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మలేసియా వద్ద ప్రస్తుతం 18 సుఖోయ్‌ 30 ఎంకేఎం యుద్ధ విమానాలున్నాయి. పైగా ఎమ్‌కే1 తరహా భారత్‌ యుద్ధ విమానాలతో అవి దాదాపు పోలి ఉంటాయి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో సుఖోయ్‌ 30 యుద్ధ విమానాల తయారీ, విడి భాగాల ఉత్పత్తి, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. 
 
ఈ పరిస్థితుల్లో భారత్‌వైపు మలేషియా మొగ్గు చూపింది.  ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధి బృందాల స్థాయిలో చర్చలు పూర్తయ్యాయి. ఇక ప్రభుత్వాల పరిధిలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
 
భారత్‌ సరఫరా చేసే తేజస్‌ యుద్ధ విమానాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎల్‌సీఏ ఎంకే 1ఏ తరహా తేజస్‌ యుద్ధ విమానాల్లో అధునాతన ఏఈఎస్‌ఏ రాడార్‌ ఉంటుంది. గాలిలోంచి గాలిలోకి, గాలిలోంచి భూమి మీద ఆయుధాలను ప్రయోగించడానికి ఈ విమానాల్లో సౌలభ్యం ఉంది. ఒక్కో తేజస్‌ ఎల్‌సీఏ ధర దాదాపు 42 మిలియన్‌ డాలర్లుగా ఉంది.
 
చైనాకు చెందిన జెఎఫ్ 17 తక్కువ ధర ఆఫర్ ఉంది. అయితే తేజస్ ఎంకె 1ఎ వేరియంటు సాంకేతికత ముందు ఇది తక్కువ స్థాయిలోనే ఉందని మలేసియా నిర్థారించుకుంది. మలేసియాకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణులు వచ్చే నెలలో భారతదేశానికి వచ్చి తేజస్ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుందని వెల్లడైంది. 
 
ఇక మలేసియాలో భారతదేశం తరఫున యుద్ధ విమానాల మరమ్మతు, నిర్వహణ, మరింత అధునాతనం చేసేందుకు ఎంఆర్‌ఒ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన వెలువడింది. రష్యాకు చెందిన స్యూ 30 ఫైటర్ల దళం బాగోగులకు ఈ కేంద్రం తోడ్పాటు ఉంటుంది. 
 
సంబంధిత అంశంపై ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నట్లు మాధవన్ తెలిపారు. అయితే అక్కడ కొన్ని రాజకీయ మార్పుల ప్రభావాలు ఉంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని, దీనిని తాము తేలిగ్గా తీసుకుంటున్నామని వివరించారు.