
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించినట్లు బ్రిటన్ మీడియా, పలు మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురిస్తున్నాయి. తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది.
గత రెండు రోజులుగా బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై అవిశ్వాసంతో పలువురు మంత్రులు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఆయన ప్రధాని పదవికి అనర్హుడు అని సొంత పార్టీ నేతలే.. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నారని అక్కడి అధికారులతో పాటు మీడియా కోడై కూస్తోంది. అయితే ఆయన అక్టోబర్ వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో కొత్త నాయకుణ్ని నియమించనున్నారు.
బోరిస్ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. కరోనా ఆంక్షలను ఉల్లంఘించి ప్రధాని అధికారిక నివాసంలో పార్టీ చేసుకోవడం పలు వివాదాలకు దారి తీసింది. దీనితో పాటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం విషయంలోనూ బోరిస్ అభాసుపాలయ్యారు. ఆయనపై లైంగిక వేధింపులు ఆరోపణలు రాగా, అతడిపై తీసుకునే చర్యల విషయంలో బోరిస్ మాట మార్చడంతో ఒక్కొక్కరుగా మంత్రుల పదవులను వీడారు.
2019లో ప్రధాని జాన్సన్ క్రిస్ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్ పట్టించుకోకుండా క్రిస్ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు.
ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్ తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులు రిషి సునక్, సాజిద్‌తో పాటు 54 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. నూతనంగా నియమితులైన ఆర్థిక మంత్రి (36 గంటల ముందు నియామకం) నదీమ్ జహవీ కూడా ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేయడంతో.. బోరిస్ ప్రధాని పదవి వీడేందుకు సిద్ధమౌతున్నారు. బోరిస్ జాన్సన్‌తో బుధవారం ఆయన మంత్రివర్గ సహచరులు సమావేశాలు జరిపి, పదవి నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయమని చెప్పినట్లు తెలిసింది.
బుధవారం, పార్లమెంటులో మాట్లాడుతూ ఇబ్బందులు తన కర్తఅయినా వ్యాన్ని కొనసాగించడమేనని అని, తన ప్రభుత్వం ముందుకు సాగడం అసాధ్యమని భావిస్తే రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. రాజీనామా చేయాలనే డిమాండ్ ను తిరస్కరిస్తూ , పదవిలో కొనసాగడానికి ఓటర్ల నుండి తనకు తీర్పు ఉన్నదని స్పష్టం చేశారు.
సొంత పార్టీ సభ్యులు, విపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాని పదవి వీడేది లేదని స్పష్టం చేస్తూ వచ్చారు. ఆర్ధిక మాంద్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల పెను సవాళ్లు దేశం ఎదుర్కొంటోందని, ఇటువంటి టైంలో బాధ్యతల నుంచి పారియేది లేదని బోరిస్ చెబుతున్నారు. అయితే తాజాగా మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో..ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు.
అయితే బోరిస్ రాజీనామా, తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. స్థానిక మీడియా కధనాల ప్రకారం పెన్నీ మొరదావుంట్, రిషి సునక్ లలో ఒకరికి బ్రిటన్ 78వ ప్రధాని కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!