శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద నడ్డాకు ఘనస్వాగతం 

హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం వచ్చిన ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా.  శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద బిజెపి నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. ఎయిర్ పోర్టు నుంచి శంషాబాద్ టౌన్ లో కిలోమీటర్ మేర రోడ్డు షో కొనసాగింది. 
 
రోడ్డుకిరువైపులా నేతలు, కార్యకర్తలు నిలబడి నడ్డాకు ఘన స్వాగతం పలికారు. జై బీజేపీ, నడ్డా జిందాబాద్ నినాదాలతో హోరెత్తింది. రోడో షో తర్వాత హెచ్ఐసిసి  లో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. గొల్లకొండ పేరిట అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి భరతమాత చిత్రపటానికి నివాళులు అర్పించారు.   ఆ తర్వాత ప్రదర్శనను తిలకించారు.
కాగా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, రజాకారుల ఆగడాలు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో బీజేపీ పాత్ర, శ్రీకాంతాచారి తదితర అమరులు, తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, కళారూపాలు, పుణ్యక్షేత్రాలు, బతుకమ్మ బోనాలు తదితర ఫొటోలతో ఉన్న ఈ ఎగ్జిబిషన్‌ ఆకట్టుకుంది.  ఎగ్జిబిషన్ లో తెలంగాణ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రంభీం, షోయాబుల్లాఖాన్ లాంటి యోధుల చరిత్ర తెలిపేలా ప్రదర్శన ఉంది.
రాత్రి 7 గంటలకు అక్కడే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్న రాజకీయ,  ఆర్థిక అంశాలపై నడ్డా వీరితో చర్చింఛారు.  రాత్రి 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, పేరణి నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత దరువు ఎల్లన్న నేతృత్వంలోని తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.  శనివారం ఉదయం 10 గంటలకు పార్టీ నేషనల్ ఆఫీసు బేరర్ల సమావేశం నడ్డా అధ్యక్షతన జరుగనుంది.