ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్

దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. డిజిటల్, టెక్నాలజీ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆయన సూచించారు.
బాష్ ఇండియా స్మార్ట్ కేంపస్‌ను మోదీ  గురువారం వీడియో మెసేజ్ ద్వారా ప్రారంభిస్తూ ఇది టెక్నాలజీ శకమని తెలిపారు. కరోనా  మహమ్మారి సమయంలో టెక్నాలజీ వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రస్తావిస్తూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు రావాలని కోరారు. ఈ రంగాల్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యమని తెలిపారు.
వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఒకటని చెబుతూ గడచిన రెండేళ్ళలో పెట్టుబడులు పుంజుకున్నాయని తెలిపారు. మన దేశ యువత వల్ల మన స్టార్టప్ ఎకో సిస్టమ్ ప్రపంచంలో అతి పెద్దవాటిల్లో ఒకటిగా ఉందని చెప్పారు. టెక్నాలజీ ప్రపంచంలోనే అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ  ప్రతి గ్రామానికీ హైస్పీడ్ ఇంటర్నెట్‌  సేవలను అందజేయాలని భారత ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
 డిజిటల్ ఇండియా స్వప్నంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడం కూడా ఉందని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని, పెట్టుబడులు పెట్టాలని ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు.
బాష్ ఇండియా మన దేశంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ కంపెనీని ప్రధాని అభినందించారు. భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఈ కంపెనీ ఓ ప్రత్యేకతకు సంబంధించిన ఉత్సవాలను జరుపుకుంటోందని  తెలిపారు. 
 
భవిష్యత్తు అవసరాలకు తగిన ఉత్పత్తులు, పరిష్కారాల అభివృద్ధి కోసం ఈ నూతన స్మార్ట్ కేంపస్ నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. తాను జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ తో కలిసి 2015లో ఈ కంపెనీని సందర్శించానని గుర్తు చేశారు.  
సౌర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం గడచిన ఎనిమిదేళ్ళలో దాదాపు 20 రెట్లు పెరిగిందని, దీంతో భారత దేశ అభివృద్ధి పర్యావరణ హితకరంగా జరుగుతోందని ప్రధాని చెప్పారు. భారత దేశంతోపాటు ఇతర దేశాల్లో కూడా  బాష్  కార్బన్ నూట్రాలిటీని సాధించినందుకు ప్రశంసించారు.
భారత దేశంలో రానున్న 25 ఏళ్ళలో ఏం చేయగలమో నిర్ణయించుకుని, లక్ష్యాలను ఏర్పరచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. వందేళ్ల క్రితం ఈ కంపెనీ ఓ జర్మన్ కంపెనీగా భారత దేశానికి వచ్చిందని, ఇప్పుడు దానికి ఎంత జర్మన్ స్వభావం ఉందో, అంత భారతీయత ఉందని కొనియాడారు. జర్మన్ ఇంజినీరింగ్, ఇండియన్ ఎనర్జీకి ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం మరింత బలపడాలని చెప్పారు.
 ఇదిలావుండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ థింగ్స్‌ కార్యకలాపాలను విస్తరిస్తామని బాష్ ఇండియా ప్రకటించింది. కేంపస్ అభివృద్ధి కోసం గడచిన ఐదేళ్ళలో రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది.