మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే

బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, శివసేన తిరుగుబాటు నేత  ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే ఊహాగానాలకు భిన్నంగా  ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా  ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. అంతకుముందు ఏక్‌నాథ్‌ షిండే గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గోవా నుంచి ముంబై చేరుకున్నారు. ముంబై చేరిన ఏక్‌నాథ్‌ షిండే తొలుత బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించారు. 

గవర్నర్ కోశ్యారీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు కేవలం షిండే మాత్రమే ప్రమాణం చేస్తారని ప్రకటించారు. మంత్రివర్గం విషయంలో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షిండే వర్గానికి బిజెపి మద్దతు ఇచ్చి, ప్రభుత్వం సాఫీగా సాగేందుకు సహకరిస్తుందని ఫడ్నవిస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిని  కాబోవడం లేదని స్పష్టం చేశారు.

సీఎం పదవిని ఫడణవీస్ చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ ‘మహా’ సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశం ఒకటి కాగా, శివసేన పార్టీపై కూడా షిండే ఆధిపత్యం వహించేటట్లు చేయడం కోసం, ఉద్ధవ్ థాకరేను ఒంటరిగా చేయడం కోసం వేసిన ఎత్తుగడగా పరిశీలకులు భావిస్తున్నారు.

గత రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన అనేక సమస్యలను షిండే నేతృత్వంలోని ప్రభుత్వం సమర్ధవంతంగా పరిష్కరిస్తుందని, మరాఠాలు, ఓబీసీలకు రిజర్వేషన్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడం కొత్త ప్రభుత్వ ప్రధానాంశాలు అని ఫడ్నవీస్ ఈ సందర్భంగా చెప్పారు. “బాలాసాహెబ్ ఠాక్రే తన జీవితాంతం వ్యతిరేకించిన వ్యక్తులతో శివసేన వెళ్ళింది. ఠాక్రే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఇద్దరు మంత్రులను అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లేలా చేసింది’’ అని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రయోజనాలు, ఎమ్యెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని షిండే స్పష్టం చేశారు.  తాను ముఖ్యమంత్రి పదవిని ఏ నాడు ఆశింపలేదని చెబుతూ, బిజెపి పెద్ద మనసుతో తనకు ఈ పదవి ఇవ్వజూపిందని అంటూ  కృతజ్ఞతలు తెలిపారు. 

షిండే తిరుగుబాటు వర్గానికి చెందిన వారితో సహా మొత్తం 170 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని బీజేపీ తెలిపింది. షిండే రాక నేపథ్యంలో ముంబై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న ఫడ్నవీస్ అధికారిక బంగ్లా అయిన ‘సాగర్’కి వెళ్ళేటప్పుడు షిండే వాహనశ్రేణికి ఎలాంటి ఆటంకం కలగకుండా రోడ్లు ఖాళీ చేయించారు.