ట్రంప్‌పై కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో హత్యాయత్నం

ట్రంప్‌పై కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో హత్యాయత్నం
 
* ట్రంప్, ఇతరులు క్షేమంగా ఉన్నారని ప్రధాని మోదీ ఊరట!

అమెరికా అధ్యక్షడు ట్రంప్‌పై హత్యాయత్నం కలకలం రేపింది. వాషింగ్టన్‌ హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో  దుండగుడు కాల్పులు జరిపాడు. సుమారు 5 నుంచి 8రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

కాగా, ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్‌’లో పోస్ట్ చేస్తూ దీనిని ‘ఒక అద్భుతమైన సాయంత్రం’ అని అభివర్ణించారు. సీక్రెట్ సర్వీస్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వేగంగా, ధైర్యంగా అద్భుతంగా పనిచేశాయని ప్రశంచారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమం కొనసాగాలని తాను కోరుకుంటున్నానని, అయితే తాను పూర్తిగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలను పాటిస్తానని తెలిపారు. 

ఈ ఘటనలో ట్రంప్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వందాలది మంది టేబుళ్ల కింద దాక్కొని ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ విందులో పాల్గొన్న వారిలో ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే ఒక ఆగంతకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రకటించారు. 

తక్షణమే స్పందించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వెంటనే బాంకెట్ హాల్‌లోకి ప్రవేశించి అధ్యక్షుడు ట్రంప్‌, ఫస్ట్‌ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విందు హాల్​ను వెంటనే ఖాళీ చేయించారు.   కాల్పుల ఘటన అనంతరం యూఎస్ సీక్రెట్ సర్వీస్ సహా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. 
 
కాల్పులు జరిగిన ప్రదేశం ప్రధాన విందు హాల్‌కు బయటగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కాలిఫోర్నియాలోని టోరెన్స్​కు చెందిన 31 ఏళ్ల కోల్​ థామస్ అలెన్​గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 
 
కాల్పుల జరిగిన కొద్ది సేపటిన తర్వాత వైట్​హౌస్​లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఘటన సమయంలో అనుమానితుడు పలు ఆయుధాలతో వచ్చాడని వెల్లడించారు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని పేర్కొన్నారు. కాల్పుల్లో ఒక భద్రతా అధికారి గాయపడిన విషయాన్ని ట్రంప్ ధృవీకరించారు. అయితే ఆయన ధరించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. 
 
చాలా దగ్గర నుంచి శక్తివంతమైన తుపాకీతో కాల్పులు జరిపడనని, కానీ జాకెట్ తనను కాపాడిందని తెలిపారు. రాజ్యాంగంపై దాడి చేసిన ఆ దుండగుడి హింసాత్మక చర్యను, అలాగే అమెరికా కోసం సీక్రెట్ సర్వీస్, ఇతర భద్రతా సంస్థలు ఎంత వేగంగా పనిచేశాయో చూపే ఒక వీడియో టేపును ఇప్పుడే విడుదల చేసినట్లు చెప్పారు. 
 
కాగా, వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్‌లో జరిగిన కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు క్షేమంగా ఉన్నారని నివేదికలు ధృవీకరించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊరట చెందారు. ఈ ఘటనను ఖండిస్తూ, “ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు” అని, దానిని గట్టిగా తిరస్కరించాలని ప్రధాని మోదీ అన్నారు. వారి భద్రత కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. 
 
“వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్‌లో ఇటీవల జరిగిన భద్రతా ఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ, ఉపాధ్యక్షుడు క్షేమంగా, ఎటువంటి హాని లేకుండా ఉన్నారని తెలుసుకుని ఊరట చెందాను. వారి భద్రత, క్షేమం కొనసాగాలని నా శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు, దానిని నిస్సందేహంగా ఖండించాలి,” అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాశారు.