చర్చలు లేకుండానే వెళ్ళిపోయిన ఇరాన్ బృందం 

చర్చలు లేకుండానే వెళ్ళిపోయిన ఇరాన్ బృందం 
అమెరికాతో పాకిస్థాన్‌లో రెండో విడత చర్చలకోసం ఒక్కరోజు క్రితమే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రత్యేక దూతలను కలువకుండానే శనివారం తిరిగి వెళ్లింది.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సారధ్యంలో పాకిస్థాన్‌కు వచ్చిన ఇరాన్ బృందం ఇక్కడ ఉన్నత స్థాయి చర్చలు జరిపింది. 
పాక్‌కు చెందిన అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులతో, సైనికాధికారులతో విస్తృత చర్చలు జరిపింది.
మూడు దేశాల పర్యటనకు వచ్చిన తాము ముందుగా పాకిస్థాన్‌కు వచ్చినట్లు ప్రకటించారు. ఈ దశలోనే ట్రంప్ దూతలతో కూడిన అమెరికా బృందం పాకిస్థాన్‌కు చేరుకుంటుందని, ఇరుదేశాల మధ్య నేరుగా చర్చలు ఉంటాయని తొలుత భావించారు.  అయితే అరాగ్చి బృందం అమెరికా బృందం వచ్చే దాకా పాకిస్థాన్‌లో ఉండకుండానే వెళ్లిపోయింది.  తాము పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను , సైనిక ప్రధానాధికారి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌ను ఇతర అధికారులను కలిసినట్లు అరాగ్చి తెలిపారని వెల్లడైంది. అయితే ఏ విషయాలపై చర్చలు జరిగాయనేది వెలుగులోకి రాలేదు. 
 
ఇక ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు పాకిస్థాన్‌కు వెళ్లవద్దని తాను అమెరికా ఉన్నతాధికారులకు చెప్పినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.  ఇరానే ఎప్పుడైనా తమకు ఫోన్ చేయచ్చని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏమీ జరగబోయేది లేనప్పుడు వృథాగా 18 గంటల విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని తాను అమెరికా సంధానకర్తలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లకు చెప్పానని ట్రంప్‌ తెలిపారు.
 
అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. శనివారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పెజెష్కియాన్ ఫోన్​లో మాట్లాడిన సందర్భంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు.
 
అయితే ఇరాన్ ఉన్నత స్థాయి బృందం ఇక్కడికి వచ్చి పలు కీలక విషయాలపై మాట్లాడి వెళ్లడం మలుపు తిప్పే పరిణామం అని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ స్థాయి విషయాలు, ఇప్పటి ఉద్రిక్తతలు, అమెరికాతో సాగుతున్న చర్చలు , మరో వైపు కవ్వింపు చర్యల విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. ప్రత్యేకించి అరాగ్చి ఇక్కడ సైనిక చీప్ మునీర్‌తో చాలా సేపు మాట్లాడారు. అమెరికాతో శాంతి చర్చల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్షించినట్లు వెల్లడైంది.  
 
అమెరికా బృందం రాకకోసం వేచి చూడకుండానే తాము తిరిగి వెళ్లుతామని ఇరాన్ బృందం ముందుగానే ప్రకటిచింది. దీనితో ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య నేరుగా రెండో దఫా చర్చలకు అవకాశం లేదని స్పష్టం అయింది.  ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో వివాదానికి తెరలేపారు. ‘ఇరాన్‌లో రెండు గ్రూపులున్నాయి. ఒక వర్గం ఒప్పందాన్ని కోరుకుంటోంది. రెండో గ్రూపు వద్దంటోంది. ఒప్పందాన్ని వ్యతిరేకించే వారిని మట్టు పెట్టాలి’ అని థిస్సెన్‌ తన పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిని తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో షేర్‌ చేసిన ట్రంప్‌పై ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఖై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది తీవ్రమైన నైతిక పతనానికి ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ‘ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు, మానవ విలువలకు ఒకప్పుడు ఛాంపియన్‌గా చెప్పుకున్న అమెరికా ఇప్పుడు ఉగ్రవాదాన్ని, హత్యలను, మూకుమ్మడి హింసను ప్రోత్సహిస్తోంది’ అని విమర్శించారు. 
 
అభిశంసనకు డెమొక్రాట్ల సన్నాహాలు

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించేందుకు డెమొక్రాట్లు సన్నాహాలు ప్రారంభించారు. సవివరమైన అభిశంసన తీర్మానాన్ని సిద్ధం చేయాలని వారు పార్టీ నాయకత్వాన్ని కోరారు. ప్రతినిధి సభపై డెమొక్రాట్లు పట్టు సాధించిన వెంటనే దానిని ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. ‘మాకు అత్యంత నిర్దిష్టమైన, సమన్వయంతో కూడిన వ్యూహం అవసరం’ అని డెమొక్రటిక్‌ సభ్యుడు డెలియా రమిరెజ్‌ చెప్పారు. ఎన్నికలకు ముందే అభిశంసన తీర్మానానికి అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉన్నదని తెలిపారు.