ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు డిజిటల్ కూంబింగ్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిజెపి  జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు కావడం కోసం మొదటిసారిగా హైదరాబాద్ లో జులై 2, 3 తేదీలలో – రెండు రోజుల పాటు ఉండబోతున్నారు. ఈ సందర్భంగా   తెలంగాణ పోలీసులు భద్రతపై భారీ కసరత్తు చేస్తున్నారు. 
 
ముఖ్యంగా అగ్నిపథ్ కు నిరసనగా జరిగిన ప్రదర్శనలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంపై గురికావడంతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  పోలీసులు డిజిటల్‌ కూంబింగ్‌ ద్వారా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న రకరకాల చర్చలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.
అనుమానిత సంభాషణలు, అవాంఛిత వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద సుమారు 5,000 మంది పోలీసులను ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత కోసం వినియోగిస్తున్నారు. ప్రధాని హోదాలో మోదీ కేవలం పార్టీ కార్యక్రమం కోసం రావడం కూడా ఇదే కావడం గమనార్హం. (ఎన్నికల ప్రచారం కోసం కాకుండా).
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు దాదాపు 40 మంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు నగరంలో రెండు రోజుల పాటు మకాం వేయనున్నారు.   అసాంఘికశక్తులు, నిరసనకారులు దీన్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముఖ్యంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, దీనికి ప్రధాన ప్రతిపక్షాలు మద్దతు తెలపడంతో ప్రధాని పర్యటన సందర్భంగా అకస్మాత్తుగా ఎక్కడైనా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
 ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి కూడా వస్తుండటంతో వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు కూడా జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అటువంటివి జరిగితే పోలీసుల వైఫల్యంగానే పరిగణిస్తారు. ఈ క్రమంలో అలాంటివి జరగకుండా ముందుగానే పసిగట్టే ఉద్దేశంతో పోలీసులు డిజిటల్‌ మాధ్యమాలను జల్లెడ పడుతున్నారు.
వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి ప్రముఖ సామాజిక మాధ్యమాలతో పాటు ఇతరత్రా చాటింగ్‌ యాప్‌లనూ గమనిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గల ప్రత్యేక ల్యాబులను పూర్తిస్థాయిలో వాడుకుంటున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌, హెచ్‌ఐసీసీ, రాజ్‌భవన్‌ చుట్టూ కేంద్ర బలగాలు మోహరించాయి.
ఇప్పటికే బహుళ అంచెల భద్రతా ప్రణాళికను రూపొందించిన పోలీసులు తాజాగా యాంటీ డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రధాని పర్యటన సందర్భంగా నిరసనలు జరపాలని పిలుపిచ్చారు. మరోవంక, అధికార పక్షం నేతలు మీడియా సమావేశాలలో, వేర్వేరు కార్యక్రమాలలో ప్రధాని పర్యటనపై ప్రశ్నలు కురిపిస్తున్నారు.
బిజెపి హైదరాబాద్ నగరం అంతా కాషాయమయం చేయబోతుంటే,  కేసీఆర్ ఫ్లెక్సీలతో హైదరాబాద్ గులాబీమయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. నగరంలోని  హార్డింగ్స్, మెట్రో  పిల్లర్స్ ను కేసీఆర్ ఫోటోలతో టీఆర్ఎస్ నింపుతున్నది. ఇటు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయ్.
ప్రధాని ప్రసంగించే బహిరంగ సభ 3న జరుగనున్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను  టీఆర్ఎస్ చేస్తుంది. అధికార పక్షమే ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉండడంతో పోలీసులు విషమ పరీక్ష ఎదుర్కొంటున్నారు.