ఆతిథ్య రంగం సేవలపై పన్ను మినహాయింపులు తొలగింపు 

ఆతిథ్య రంగం సేవలపై పన్ను మినహాయింపులను తొలగించాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది. రోజుకు రూ.1000లోపు అద్దె వసూలు చేసే హోటల్‌ వసతికి ప్రస్తుతం ఇస్తున్న జీఎస్టీ మినహాయింపును తొలగించాలని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం సిఫారసు చేసింది. అంటే రూ.1000లోపు లభించే హోటల్‌ గదులపై ఇక మీదట 12ు జీఎస్టీ వసూలు చేస్తారు.
 
చండీగఢ్‌లో జరుగుతున్న జీఎస్టీ మండలి రెండు రోజుల సమావేశంలో భాగంగా మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరుగుతున్న జీఎస్టీ మండలి సమావేశాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, ఆర్థిక మంత్రులు పాల్గొని పలుప్రతిపాదనలు చేశారు. 
 
కొన్ని వస్తువులపై పన్ను రేట్లలో మార్పులు చేసేందుకు, మరికొన్నింటికి ఇస్తున్న మినహాయింపులను తొలగించేందుకు జీఎస్టీ (వస్తు సేవల పన్ను) మండలి ఆమోదం తెలిపింది. ఇక ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందే రోగులు రూ.5 వేల కన్నా ఎక్కువ అద్దె కలిగిన గది తీసుకుంటే (ఐసీయూకు మినహాయింపు).. 5 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం సిఫారసు చేసింది.
మరోవైపు పోస్టు కార్డులు, ఇన్‌ల్యాండ్‌ లెటర్లు, బుక్‌పోస్ట్‌, ఎన్వలప్‌ (పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉండాలి)లు మినహా అన్ని పోస్టల్‌ సేవలపైనా జీఎస్టీ వసూలు చేయనున్నారు. అలాగే బ్యాంకులు జారీ చేసే చెక్కులపై (విడిగా లేదా పుస్తకమైనా) 18ు జీఎస్టీ వసూలు చేయాలని కౌన్సిల్‌ ప్రతిపాదించింది.
ఇక వ్యాపార సంస్థలకు ఉండే నివాస సముదాయాల అద్దెలకు ఇస్తున్న పన్ను మినహాయింపును కూడా తొలగించనున్నారు. బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్లను రాష్ట్రాల మధ్య రవాణా చేసుకునేందుకు ఈ-వే బిల్లును తప్పనిసరి చేసే అంశంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మండలి పేర్కొంది.
 రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల రవాణాకు ఎలకా్ట్రనిక్‌ బిల్లు తప్పనిసరి చేయాలని మంత్రుల బృందం ఇప్పటికే సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేతలను అడ్డుకొనేందుకు ఎలకా్ట్రనిక్‌ బిల్లును తప్పనిసరి చేయడంపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని మండలి పేర్కొంది.
మాంసం, చేపలు, పెరుగు, పన్నీరు, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్‌, లేబుల్డ్‌ ఆహార పదార్థాలకు ప్రస్తుతం పన్ను మినహాయింపు ఉండగా.. ఇకపై ఆయా పదార్థాల మీద 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. మ్యాప్‌లు, చార్టులు, అట్లా్‌సలపైనా 12 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. ఇక ప్యాకింగ్‌ చేయని, లేబుళ్లు లేని, బ్రాండ్‌ లేని వస్తువులకు జీఎస్టీ మినహాయింపు కొనసాగుతుంది.
కాగా,  విపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలు జీఎస్టీ ఆదాయాన్ని పంచే సూత్రాన్ని మార్చాలని లేదా పరిహారాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశాయి. జీఎస్టీని ప్రవేశపెట్టిన సమయంలో కేంద్రం 2022 జూన్‌ వరకు రాష్ట్రాల రెవెన్యూ నష్టాలను భర్తీ చేసేందుకు గాను జీఎస్టీ పరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చింది.
ఆ గడువు ఈ నెలతో ముగుస్తుండడంతో పలు రాష్ట్రాలు పరిహారాన్ని పెంచాలని లేదా జీఎస్టీ ఆదాయ పంపిణీ విధానాన్ని మర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. జీఎస్టీ మండలిలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు తీర్పును మంగళవారం నాటి మండలి భేటీలో విపక్ష పాలిత రాష్ట్రాల నేతలు ప్రస్తావించారు.