ఆంధ్ర ప్రదేశ్ లో పులుల సంఖ్య 55 నుంచి 65

ఆంధ్ర ప్రదేశ్ లో నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుతోపాటు ఏజెన్సీ, శేషాచలం అన్ని ప్రాంతాలో కలిపి 55 నుండి 65 వరకూ పులుల సంఖ్య ఉండొచ్చని అంచనా వేశారు. కాలి గుర్తులు, కెమెరా రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఈ అంచనాకు వచ్చింది. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పులుల గణాంకాల ప్రకారం 48 పులులతో దేశంలో ఆంధ్ర ప్రదేశ్ 12వ స్థానంలో ఉంది.
పొరుగున ఉన్న తెలంగాణ 26 పులులతో 16వ స్థానంలో ఉంది. దక్షిణాదిన కర్ణాటక 524 పులులతో దేశంలో ద్వితీయ స్థానంలో, 264 పులులతో తమిళనాడు 5వ స్థానంలో ఉంది. 526 పులులతో మధ్య ప్రదేశ్ దేశంలో ప్రధమ స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచంలోని పులలలో 75 శాతం భారత్ లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. 
 
ప్రస్తుతం మన రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఇది కాకుండా పాపికొండల ప్రాంతంలోనూ పులల సంచారం ఉంది. ఒడిస్సా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ప్రాంతాల నుండీ మన రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. మహారాష్ట్రలో మాల్గార్‌ రిజర్వు నుండి నిత్యం మన రిజర్వులోకి రాకపోకలు సాగిస్తుంటాయి.
 
 ఒడిస్సాలోని సిమ్లిపాల్‌ రిజర్వు నుండి పులులు వస్తుంటాయి. రాష్ట్రంలో సుమారు 3500 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల సంచారం ఉన్నట్లు అంచనా. ప్రతి పులి తన టెరిటోరిల్‌(సరిహద్దులు) 100 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. అంటే సుమారు 2500 ఎకరాలు సరాసరిగా ఉంటుంది. 
 
ప్రతి ఏటా పులుల సంఖ్యపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 590 వరకూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 55 నుండి 65 మధ్య ఉండొచ్చని లెక్కగట్టారు. 
 
ప్రసుత్త కాకినాడ పరిధిలో తిరుగుతున్న పులి కూడా మన రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఇటీవల లభించిన వీడియో, పంజా గుర్తుల ఆధారంగా అది ఇతర రాష్ట్రం నుండి వచ్చి ఉండచ్చని చెబుతున్నారు. ఒడిస్సా అటవీ ప్రాంతం నుండి వచ్చిందని, వచ్చే క్రమంలో దారితప్పి రావడం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
 అదే సమయంలో పశు మాంసానికి అలవాటు పడటంతో పూర్తిస్థాయిలో టెరిటరీ ఏర్పాటు చేసుకోలేదని, దీనివల్ల కొంత గందరగోళానికి గురవుతోందని తేల్చారు. అయితే అది తిరిగి వెళ్లే క్రమంలో ప్రస్తుతం తుని పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చని తేల్చారు. రాకపోకలు సాగించే దారిలేకపోవడం వెనుక ప్రకృతి సహజమైన వనరులు ధ్వంసం కావడం కూడా కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
అడవి జంతువులు నిరంతరం తిరిగే మార్గంలో అడ్డంకులు ఎదురైనప్పుడు మాత్రమే అవి దారితప్పుతాయని, లేనిపక్షంలో అంత తొందరగా వాటి సరిహద్దులు దాటి రావని చెబుతున్నారు. జూన్‌, జులై నెలల్లో పులుల సంఖ్యను ప్రకటించే సమయం కావడం ఇదే సమయంలో రాష్ట్రంలో పులి దారితప్పి ప్రయాణిస్తుండటంతో రాష్ట్రంలో పులుల సంఖ్య, వాటి కదలికలపైనా ఆసక్తి ఏర్పడింది.
 తుని పరిసరాల్లో ఉన్న పులి యుక్త వయస్సువల్ల తోడు కోసం దారితప్పిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ప్రకృతి సిద్ధమైన అనేక కారణాలు ఇందులో ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. నిజంగా తోడు కోసమైతే పులి ఇంతదూరం ప్రయాణం చేయదని, కేవలం దారితప్పడం వల్లే కొంత గందరగోళానికి గురైందని చెబుతున్నారు. త్వరలోనే జాడను గుర్తిస్తామని స్పష్టం చేస్తున్నారు.