జి 7 దేశాధినేతలకు బహుమతులుగా భారతీయ కళా నైపుణ్యాలు 

ఏడు దేశాల కూటమి సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్ళిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కళా నైపుణ్యాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ, దక్షిణాఫ్రికా దేశాధినేతలకు ఉత్తర ప్రదేశ్‌ కళాకారులు ప్రత్యేకంగా  తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇచ్చారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ ప్లాటినమ్ జూబిలీ జరుపుకున్న నేపథ్యంలో ఆ సందర్భానికి తగినట్లుగా ఓ బహుమతిని తీర్చిదిద్దడం మరో విశేషం. ఉత్తర ప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ పథకంలో ఈ బహుమతులను తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కళాకారుల పనితనానికి గుర్తింపు లభించే విధంగా ఈ బహుమతులను తీర్చిదిద్దారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో తయారైన గులాబీ మీనాకరి బ్రోచ్‌ను బహూకరించారు. దీనిని స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీని మీద అత్యంత ఆకర్షణీయమైన నగిషీ చెక్కారు. ఇది జిఐ ట్యాగ్ గల కళాకృతి. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ కోసం రూపొందించిన బ్రోచ్‌కు మ్యాచ్ అయ్యే విధంగా జో బైడెన్ కఫ్‌లింక్స్‌ను తయారు చేయడం విశేషం.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో తయారైన క్యారియర్ బాక్స్‌ను, ఖాదీ పట్టు వస్త్రంపై చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జరీ జర్దోసీ బాక్స్‌ను, ఫ్రెంచ్ జాతీయ జెండాలో ఉండే మూడు రంగులతో శాటిన్ టిష్యూను బహుమతిగా ఇచ్చారు.
 
 ఈ జెండా ఫ్రెంచ్ విప్లవం నాటిది కావడం గమనార్హం. ఈ పెట్టెలో అత్తర్ మిట్టి, జాస్మిన్ ఆయిల్, అత్తర్ షమమ, అత్తర్ గులాబ్, ఎక్సోటిక్ మస్క్, గరం మసాలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం అత్తర్ మిట్టి.
 
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు ప్లాటినం పెయింటెడ్ హస్తకళాకృతి టీ-సెట్‌ను బహూకరించారు. దీనిని ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో తయారు చేశారు. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబిలీ ఉత్సవాలను గుర్తు చేస్తూ, ఆమె గౌరవార్థం ఈ టీ-సెట్‌కు ప్లాటినం పెయింట్ వేశారు.
 
జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు నికెల్ కోటింగ్‌తో కూడిన కంచు బిందెలను బహూకరించారు. వీటిని ఉత్తర ప్రదేశ్‌లో కంచు నగరంగా ప్రసిద్ధి చెందిన మొరాదాబాద్ జిల్లాలో తయారు చేశారు.
 
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదకు ఉత్తర ప్రదేశ్‌లోని నిజామాబాద్‌లో తయారు చేసిన పాత్రలను బహూకరించారు. వీటిని నల్ల మట్టితో తయారు చేశారు. నల్ల రంగును ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం కోసం ప్రత్యేకమైన చిట్కాలను ఉపయోగించారు. ఓవెన్‌లోకి ఎట్టి పరిస్థితిలోనూ ఆక్సిజన్ ప్రవేశించడానికి వీల్లేకుండా తీర్చిదిద్దారు. ఈ కుండలు ఈ ఓవెన్‌ లోపల ఉన్నంత సేపూ వేడి స్థాయి అత్యధికంగా ఉంటుంది.
కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడుకు కశ్మీరులో తయారైన పట్టు తివాచీని బహూకరించారు. ఇది చేతితో అల్లిన తివాచీ. ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రఘికి మార్బుల్ ఇన్‌లే టేబుల్ టాప్‌ను బహూకరించారు. ఇది ఇటాలియన్ మార్బుల్ ఇన్‌లే వర్క్‌తో పోటీ పడుతూ ఉంటుంది. సెనెగల్ ప్రెసిడెంట్‌ మాకీ సాల్‌కు మూంజ్ బాస్కెట్స్, కాటన్ డరీస్‌ను బహుమతిగా ఇచ్చారు.
 
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా‌కు డోక్రా ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని రామాయణం ఇతివృత్తంతో ఛత్తీస్‌గఢ్‌లో తయారు చేశారు. ఈ నాన్-ఫెర్రస్ మెటల్ కాస్టింగ్ ఆర్ట్‌ను భారత దేశంలో దాదాపు 4,000 ఏళ్ళ క్రితం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు లకీర్‌వేర్ రామ్ దర్బార్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిని వారణాసిలో తయారు చేశారు.