
జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న జి-7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అమెరికా, కెనడా, ఫ్రాన్స్ దేశాల నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం జర్మనీ వచ్చిన మోదీకి తొలుత జర్మన్ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జు సాదరంగా స్వాగతం పలికారు.
జి 7 సదస్సులో ఫోటో సెషన్ ప్రారంభమవడానికి ముందుగానే అమెరికా అధ్యక్షుడు బైడెన్ మోదీ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి పరస్పరం కరచాలనం చేసుకుని, పుష్పగుచ్ఛాలు అందించుకున్నారు. గ్రూపు ఫోటోలో కెనడా ప్రధాని పక్కన నిలుచున్న మోదీ ఆయనతో కూడా కరచాలనం చేసి మాట్లాడారు.
ఇక గ్రూపు ఫోటో అనంతరం ఫ్రాన్స్ నేత మాక్రాన్, మోదీ కాసేపు ముచ్చటించుకున్నారు. ప్రపంచ నేతలతో జి 7 సదస్సు వేదిక వద్ద అంటూ గ్రూపు ఫోటోను ప్రధాని ట్వీట్ చేశారు. జి 7 సదస్సుకు రావాల్సిందిగా భారత్, అర్జెంటీనా, ఇండోనేషియా, సెనెగల్, దక్షిణాఫ్రికా నేతలను ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జర్మనీ ఆహ్వానించింది.
”అంతర్జాతీయంగా వున్న బాధ్యతల గురించి పటిష్టమైన ప్రజాస్వామ్య దేశాలకు తెలుసు. సుస్థిరమైన రీతిలో పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరచడం, అంతర్జాతీయ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం, ప్రజాస్వామ్య దేశాలు మరింత ధృఢంగా వుండేలా చూడడం కోసం నిర్దిష్టమైన చొరవలు చేపట్టడం మా లక్ష్యం.” అని జి7 ప్రకటన పేర్కొంది.
బెల్ట్ అండ్ రోడ్‌కు ప్రతిగా 60 కోట్ల డాలర్లతో ప్రణాళిక
కాగా, చైనా బెల్ట్ అండ్ రోడ్‌కు ప్రతిగా 60కోట్ల డాలర్లతో వర్థమాన దేశాల్లో సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును జి 7 సదస్సు ప్రకటించింది. ఈ నిధులను వర్ధమాన దేశాల్లో అవసరమైన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించనున్నట్లు జి-7 దేశాలు తెలిపాయి. ”గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పార్టనర్‌షిప్” పేరుతో ఈ ప్రాజెక్టును ప్రకటించాయి.
ఈ ఐదేళ్ళ ప్రాజెక్టుకు అమెరికా తన వంతుగా 20 కోట్ల డాలర్లను అందచేస్తుంది. మిగతా 40 కోట్ల డాలర్లను జర్మనీ, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా సమకూర్చాల్సి ఉంటుంది.ఆసియా, యూరప్‌ల అనుసంథానికి ఇది ఉపయోగపడుతందన్నారు.
2013లో చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని పలు దేశాలతో రైల్, రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలతో సహా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటునిచ్చింది. చైనాను ఎలా ఎదుర్కోవాలనేదానిపై ఒక ప్లేబుక్‌తో అమెరికా అధ్యక్షుడు బైడెన్ యూరప్‌నకు చేరుకున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది.
మొదట యూరోపియన్ యూనియన్, తరువాత జి-7. అది ముగిసిన వెంటనే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నాటో శిఖరాగ్ర సదస్సును వరుసగా నిర్వహించడంలోని ఆంతర్యమిదే. నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నూతన వ్యూహాన్ని వెల్లడించనున్నట్లు ఆ కూటమి చీఫ్ స్టాల్టెన్ బర్గ్ పేర్కొన్నారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ