కేంద్ర మంత్రులు, నేతలు తెలంగాణ అంతటా మూడు రోజుల మకాం!

జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మొత్తం తెలంగాణాలో తామే రాజకీయ ప్రత్యామ్న్యాయం అనే అభిప్రాయాన్ని ప్రజలలో బలంగా కలిగించడం కోసం బిజెపి జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఇతర కీలక నేతలను తెలంగాణకు పంపి, మొత్తం 119 నియోజకవర్గాలలో ఒక్కరు మూడు రోజుల చొప్పున ఉండేటట్లు చేస్తున్నారు. 
 
క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు, పార్టీ బలోపేతానికి అవసరమైన కార్యాచరణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీరిని పంపుతున్నారు. అందుకోసం ఇప్పటికే ఒకొక్క నియోజకవర్గాన్ని ఒకొక్క రాష్ట్ర స్థాయి నేతను సమన్వయకర్తగా నియమించారు. వీరు జాతీయ నాయకుడి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.
 
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మద్దతు కోరడంతో పాటు, రాష్ట్రానికి కేంద్రం, బీజేపీ జాతీయ నాయకత్వం అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం గురించి తెలియజేస్తారు. హైదరాబాద్‌లో కార్యవర్గ భేటీ నిర్వహణ ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి, 3న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ బహిరంగ సభకు రావాలంటూ ఆహ్వానాలు అందజేస్తారు.
 
ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కిరణ్‌ రిజిజు, పురుషోత్తమ్‌ రూపాలా, అనురాగ్‌ ఠాకూర్‌ తదితర కేంద్ర మంత్రులు, రమణ్‌సింగ్, దేవేంద్ర ఫడ్నవిస్‌ తదితర మాజీ సీఎంలు, ప్రకాశ్‌ జవదేకర్, రవి శంకర్‌ప్రసాద్, రాజీవ్‌ప్రతాప్‌ రూఢీ, సినీనటి ఖుష్బూ వంటి నేతలు మూడురోజుల పాటు నిర్దేశిత ప్రాంతాల్లో మకాం వేయనున్నారు. వీరంతా తెలంగాణకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల నేతలు  కావడం ఆసక్తి కలిగిస్తోంది.
 
అధికార టీఆర్‌ఎస్‌ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆయా అంశాలన్నిటిపై జాతీయ నాయకత్వానికి నివేదికలు సమర్పిస్తారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలను, చేయాల్సిన మార్పులను కూడా సూచిస్తారు. కాగా ఆయా ప్రాంతాల నుంచే నేతలంతా 2వ తేదీ మధ్యాహ్నం జాతీయ భేటీ వేదికైన నోవాటెల్‌కు చేరుకుంటారు. 
ఇక, జులై 3న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ సభలో సుమారు 10 లక్షల మంది ప్రజలు పాల్గొనేటట్లు చేయడం ద్వారా తెలంగాణాలో ఇక బిజెపికి తిరుగులేదని సంకేతం ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్నారు. 
 
వచ్చే ఏడాది జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వచ్చేటట్లు వ్యూహాటకంగా ప్రయత్నాలు సాగిస్తున్న బిజెపి జాతీయ నాయకత్వం ఈ సమావేశాలను ఆ దిశలో కీలక మార్పుకు నాందిగా మార్చుకొనే విధంగా భారీ సన్నాహాలు చేస్తున్నారు. 
 
ముందురోజే హైదరాబాద్ కు చేరుకోనున్న పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయం నుండి సుమారు 50 వేల మందితో స్వాగతం పలికి, ఊరేగింపుగా తీసుకు రావాలని రాష్ట్ర పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.