రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట

జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించడం ద్వారా రెబెల్ ఎమ్యెల్యేలకు రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత.. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్ధవ్ సర్కార్‌ను ఆదేశించింది.

శివసేన పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో షిండే ఈ అంశాన్ని పేర్కొన్నారు. దీంతో థాకరే ప్రభుత్వం అసెంబ్లీలో మైనార్టీలో పడినట్లయింది.

 అనర్హత నోటీసులపై శివసేన తిరుగుబాటు నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్  తీసుకున్న నిర్ణయంపై ఏక్‌నాథ్ షిండే అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

 అయితే.. అనర్హత నోటీసులపై ముంబై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సుప్రీంకోర్టు షిండే తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని, అత్యవసరంగానే సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చిందన్న షిండే న్యాయవాది కోర్టుకు బదులిచ్చారు. 

నోటీసులు జారీచేసే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదని షిండే తరపు న్యాయవాది వాదించారు. పైగా, ఉద్ధవ్‌ఠాక్రే బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. 

ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత 3 రోజుల్లోగా రిజాయిండర్‌ దాఖలు చేయాలని తెలిపింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. 

కాగా, అధికారక బాధ్యతలు విస్మరించిన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండేను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. షిండే, మరో 38 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ హోటల్‌లో బస చేసినట్టు పిటిషనర్ ఆ పిల్‌లో తెలిపారు. 

మరోవంక, తిరుగుబాటు చేసిన మంత్రుల శాఖలను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో ఏక్‌నాథ్‌ షిండే సహా 9 మంది మంత్రులుగువహటిలోని హోటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ 9 మంది మంత్రిత్వ శాఖలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర సిఎంఒ కార్యాలయం సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పాలనా వ్యవహారాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో వీరి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించినట్లు సిఎంఒ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం థాకరే కేబినెట్‌లో శివసేన నుండి కేవలం నలుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. వీరిలో ఆదిత్య థాకరే మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్సీలే కావడం గమనార్హం.