బీజేపీని కట్టడి చేసేందుకు సీఎంఓలో ప్రత్యేక విభాగం

భారతీయ జనతా పార్టీని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.  అయితే,టీఆర్ఎస్ రాక్షస పాలన నుండి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు తెగించి కొట్లాడుతున్న బీజేపీ కార్యకర్తలను కట్టడి చేయడం కేసీఆర్ తరం కాదని స్పష్టం చేశారు. 
 
భారతీయ జనతా పార్టీ జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో సంజయ్ ఆదివారం పరేడ్ మైదానానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్టయ్యిందని, ప్రజలంతా సాలు దొర… సెలవు దొర అంటూ కేసీఆర్ కుటుంబ పాలనను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
 
 వచ్చేనెలలో బీజేపీ నిర్వహించబోయే జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు, వారికి భరోసా ఇస్తామని తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంటే కేసీఆర్ కు వచ్చి నొప్పేంటని సంజయ్ ప్రశ్నించారు.
 
 ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని, కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్టయ్యిందని… అందుకే అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండి పడ్డారు. టీచర్ల ఆస్తులు ప్రకటించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం అందులో భాగమేనని అంటూ  బీజేపీ చేసిన హెచ్చరికతో ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారని చెప్పారు. 
 
పలువురు బీజేపీలో చేరిక 
 
కాగా, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ సమక్షంలో వందలాది మంది టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరిలో రాష్ట్ర కనీస వేతనాల సలహా సంఘం ఛైర్మన్ సామ వెంకటరెడ్డి, చందానగర్ నగర్ మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి, అఖిల భారత బంజారా సంఘం నాయకులు క్రిష్ణా నాయక్, మాలోతు చంద్రశేఖర్, సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ డాక్టర్ రాజాగౌడ్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు.
 
అధికార పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ తమకు తెలంగాణ ఆకాంక్షలే ముఖ్యమని చెబుతూ ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని అంటూ వారిని సంజయ్ స్వాగతించారు. టీఆర్ఎస్ లో నిజమైన ఉద్యమకారులకు స్థానం లేదని, ఉద్యమ ద్రోహులకు, ఉద్యమకారులపై దాడులు చేశారో వారే టీఆర్ఎస్ ఫ్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారని ధ్వజమెత్తారు.
 
 ‘తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా కరువైనయ్. మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలు, డ్రగ్స్ మాఫియాకు అడ్డగా తెలంగాణ మారింది. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు భిన్నగా పాలన కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కళ్లు మూసుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నారు’ అంటూ సంజయ్ విమర్శించారు. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడాలంటే… సంఘవిద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటే… ప్రజలు సుఖ:సంతోషాలతో 
 
జీవించాలంటే, తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అని స్పష్టం చేశారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.
 
నీళ్ల పేరుతో ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని, రుణమాఫీ చేయలేదని,  పంటల బీమా పథకం ఊసే లేదని సంజయ్ ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని అంటూ  ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు.