యుపిలో రెండు ఎస్పీ లోక్ సభ సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ

మూడు లోక్ సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల్లో   పంజాబ్ లో అధికార పక్షం ఆప్ కు, ఉత్తర ప్రదేశ్ లో సమాజవాద్ పార్టీలకు తమ కంచుకోటలలో పరాజయం ఎదురైంది.  ఉత్తర ప్రదేశ్ లో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అజాంగఢ్ తో పాటు, ఆ పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ గత ఎన్నికలలో గెలుపొందిన సీటును కూడా బిజెపి గెల్చుకుంది. 
 
ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించడంతో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కోసం రాజీనామా చేసిన  సంగ్రూర్ లోక్ సభ  స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గుర్మైల్ సింగ్ పరాజయం చెందారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి-ఎ) అభ్యర్థి సీంరంజిత్ సింగ్ మాన్ 6,800 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజవర్గం ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ లోథి ఇక్కడి నుంచి తన సమీప ప్రత్యర్థి మహమ్మద్ అసీం రజాపై 42,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత అజాం ఖాన్ అసెంబ్లీకి ఎన్నిక కావడంతో లోక్ సభకు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఖాన్ సన్నిహితుడిగా మహమ్మద్ అసీం రజాకు పేరుంది.
 
మరోవంక అఖిలేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన ఆజంఘర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా 8వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి ధర్మేంద్ర యాదవ్ (ఎస్పీ) పై గెలుపొందారు. దినేశ్ లాల్ యాదవ్ నిరాహువాకు 3.13 లక్షల ఓట్లు, ధర్మేంద్ర యాదవ్ కు 3.04 లక్షల ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ఆలం గుడ్డు జమాలీకి 2.66 లక్షలు ఓట్లు పోల్అయ్యాయి.   
ఎన్నికల ఫలితాలపై హర్షం ప్రకటిస్తూ మత ఘర్షణలు, నేరగాళ్లను రెచ్చగొట్టే వంశపారంపర్య, కులతత్వ పార్టీలను ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరనే సందేశం ప్రజలు పంపారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. 
త్రిపురలో నాలుగు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా టౌన్ బర్డోవలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై 6,104 ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ విజయంతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి మార్గం సుగమం అయింది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన గత నెల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టడంతో అసెంబ్లీకి ఎన్నిక కావలసి వచ్చింది.  ఈ ఉప ఎన్నికల్లో టౌన్ బర్డోవలి, జుబరాజ్ నగర్, సుర్మ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ అగర్తల నియోజకవర్గం నుంచి 3,163 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
వీరి ముగ్గురి ఎన్నికతో 60 మంది సభ్యులున్న త్రిపుర శాసన సభలో బిజెపి బలం 36కు పెరగగా, భాగస్వామ్య పక్షం ఐపిఎఫ్టి కి మరో ఎనిమిది మంది ఎమ్యెల్యేలు ఉన్నారు.
 
ఢిల్లీ రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్ సమీప బీజేపీ అభ్యర్థి రాజేష్ భాటియాపై 11 వేల ఓట్లకు పైగా అధిక్యతతో విజయం సాధించారు. రాజిందర్ సింగ్ ఎమ్మెల్యే, ఆప్ నేత రాజీవ్ చద్దా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక జరిగింది.
 
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి విక్రమ్ రెడ్డి గెలుపొందారు. మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక జరిగింది. ఝార్ఖండ్ మందార్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు.