ఎమర్జెన్సీ కాలాన్ని ఎన్నటికీ మరచిపోకూడదు

 
“24, 25ఏళ్ల యువతను నేను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైనది. కానీ దీనికి సమాధానాన్ని మాత్రం కచ్చితంగా ఆలోచించండి. మీ వయసులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు జీవించే హక్కు కూడా లేదని మీకు తెలుసా? నమ్మడానికి సాధ్యం కాకపోయినా.. ఇది మన దేశంలో ఒకసారి జరిగింది” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ కాలం నాటి నిరంకుశ పాలనను గుర్తు చేశారు.
“ఇది 1975 నాటి సంగతి. సరిగ్గా ఇదే సమయంలో జూన్ లో దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు. అప్పుడు దేశ ప్రజలు అన్ని హక్కులూ కోల్పోయారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఆ సమయంలో భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు జరిగాయి” అని పేర్కొన్నారు.
“దేశంలోని న్యాయస్థానాలు, ప్రతి రాజ్యాంగ సంస్థ, పత్రికా రంగాలు అన్నీ నియంత్రణకు గురయ్యాయి. ఆమోదం లేకుండా ఏదీ ప్రచురించకూడదని సెన్సార్‌షిప్ చాలా కఠినంగా వ్యవహరించింద”ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా తెలిపారు.
“నాకు గుర్తుంది, అప్పటి ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి నిరాకరించడంతో ఆయనపై నిషేధం ప్రకటించారు. దీంతో ఆయన్ని రేడియోల్లో ప్రవేశానికి కూడా నిరాకరించారు. అయితే ఎన్నో అరెస్టులు, వేలాది మందిపై దౌర్జన్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం ఏ మాత్రం సడలలేదు” అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
“శతాబ్దాలుగా మనలో పాతుకుపోయిన ప్రజాస్వామ్య విలువలు, మన హృదయాల్లో ఉన్న  ప్రజాస్వామ్య స్ఫూర్తి చివరకు విజయం సాధించాయి. దేశంలో ఎమర్జెన్సీని తొలగించి ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు” అని వివరించారు.
 నేడు, దేశం స్వాతంత్ర్యం పొంది…  75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో  ఆ భయంకరమైన ఎమర్జెన్సీ చీకటి కాలాన్ని ఎన్నటికీ మరచి పోకూడదని ప్రధాని స్పష్టం చేశారు. అమృత్ మహోత్సవం మనకు విదేశీ పాలన నుండి స్వాతంత్ర్యం గురించి మాత్రమే కాకుండా 75 సంవత్సరాల స్వాతంత్ర్య ప్రయాణాన్ని కూడా చెబుతుందని మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు.