ద్రౌపది ముర్ముకు మాయావతి మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు విపక్షాల కూటమి తనను సంప్రదించలేదని ఆమె చెప్పారు. బీఎస్పీ ఉద్యమంలో ఆదివాసీ సమాజం ఒక ముఖ్యమైన భాగమని, అందుకే ఆదివాసీ సామాజికవర్గానికి చెందిన ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయించామని తెలిపారు. 

అయితే, బీజేపీకి అండగా ఉండడమో లేక కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడమో తమ ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. సమర్థత, అంకితభావం కలిగిన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేయడమే తమ ఉద్దేశమని ఆమె చెప్పారు.

ఇలా ఉండగా, ప్రతిపక్ష నాయకుల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శనివారం జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) అధినేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఫోన్ చేసి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఆమె గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. సోరెన్‌కు వ్యక్తిగతంగా ఫోన్ చేసిన ముర్ము తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు గిరిజన పార్టీ అయిన జెఎంఎం తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో శనివారం సమావేశమైంది.

కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎలో భాగస్వామ్య పక్షమైన జెఎంఎం ఆ కూటమితోనే జార్ఖండ్‌లో అధికారంలో ఉంది. అయితే, ఆమెకు తమ మద్దతుపై ఇప్పటికే సొరేన్ సంకేతం ఇచ్చారు.  హేమంత్‌ త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో దీనిపై చర్చిస్తారని తెలుస్తున్నది. 

కాగా., .నామినేషన్ వేయడానికి ముందు ముర్ము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, టిఎంసి అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ముగ్గురు నాయకులు కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలియచేశారని వర్గాలు చెప్పాయి.