రెబెల్ ఎమ్యెల్యేల రక్షణపై మహారాష్ట్ర గవర్నర్ ఆదేశాలు 

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై శివసేన సీనియర్ నేత ఎకనాథ్ షిండే నాయకత్వంలో ఎమ్యెల్యేల తిరుగుబాటుతో చెలరేగిన రాజకీయ సంక్షోభం ఆరవ రోజుకు చేరుకోగా, ఇప్పటివరకు కరోనా కారణంగా ఆసుపత్రిలో ఉన్న గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ఆదివారం తన అధికార నివాసంకు చేరుకొని, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై స్పందించడం ప్రారంభించారు.
మొదటగా తిరుగుబాటు చేసిన ఎమ్యెల్యేల కార్యలయాలు, ఇళ్ళపై శివ సైనికులు దాడులు చేస్తున్న దృష్ట్యా వారందరికీ రక్షణ కల్పించాలని డిజిపిని ఆదేశించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై వాకబు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు జరిగిన  హింసాత్మక ఘటనలపై షిండే స్పందిస్తూ మహా వికాస్ అఘాడీ బారి నుంచి పార్టీని కాపాడటం కోసమే  తాను పోరాడుతున్నట్లు శివసేన కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కోరారు.
మరోవంక, 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సిఆర్‌పిఎఫ్ కమాండోల వై-ప్లస్ భద్రతను కేంద్రం ఆదివారం పొడిగించినట్లు అధికారులు తెలిపారు. భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాబాయి సోనావానే, ప్రకాస్ సర్వే , మరో 10 మంది ఉన్నారు.
 
 మహారాష్ట్రలో నివసిస్తున్న వారి కుటుంబాలకు కూడా భద్రత ఉంటుందని వారు తెలిపారు. దాదాపు నాలుగు నుంచి ఐదుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) కమాండోలు, షిఫ్టుల వారీగా, ప్రతి ఎమ్మెల్యే మహారాష్ట్రకు వచ్చిన తర్వాత వారికి భద్రత కల్పిస్తారని వారు తెలిపారు.
 
ఇదిలా ఉండగా ఎంపీ  నవనీత్‌ కౌర్‌ రానా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరడం గమనార్షం. శివ సైనికుల గూండాయిజంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
 కాగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేలను వారి భార్యలతోనే నచ్చచెప్పించే ప్రయత్నాలను ఉద్ధవ్ థాకరే సతీమణి రష్మి థాకరే చేపట్టారు. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో రష్మి సంప్రదింపులు సాగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ఉద్ధవ్ థాకరే సైతం గౌహతిలోని హోటల్‌లో బస చేసిన పలువురు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్టు చెబుతున్నారు.
పార్టీ విప్‌ను పాటించనందుకు షిండేతో సహా గౌహతిలో ఉన్న 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ అనర్హత నోటీసులు జారీ చేసినప్పటికీ  సీనియర్ నాయకుడు ఎకనాథ్  షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం తమ పట్టును కొనసాగిస్తున్నది. డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు శిబిరం ఇప్పటికే తొలగింపు కోసం మోషన్‌ను పంపిన దృష్ట్యా,  సమన్లను కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది.