సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సుప్రీంకోర్టుకి చేరింది. డిప్యూటీ స్పీకర్‌ నరహరిజైర్వాల్‌ తమపై ఇచ్చిన అనర్హత వేటు నోటీసులను సవాల్‌ చేస్తూ షిండే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిప్యూటీ స్పీకర్‌ నోటీసుతో పాటు, శివసేన శాసనసభాపక్ష నేతగా అజరు చౌదరిని నియమించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరుతూ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. 

అనర్హత పిటిషసన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరారు. అలాగే తమ కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరారు. సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. 

కాగా.. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు వ్యక్తిగతంగా తమ వద్దకు వచ్చి అనర్హత నోటీసుపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ ఆదేశించారు.  మహారాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే అజయ్  చౌదరిని నియమించాలన్న శివసేన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. 

ఈ మేరకు ఓ లేఖను శివసేన కార్యాలయ కార్యదర్శికి డిప్యూటీ స్పీకర్‌ కార్యాలయం పంపింది. రెబల్‌ ఏక్‌ నాథ్‌ షిండే స్థానంలో ఆయన ఉండనున్నారు.

మరోవంక, ఏక్‌నాథ్‌ షిండేకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, తాజాగా విద్యాశాఖ  మంత్రి ఉదయ్  సావంత్‌ ఆయన గూటికి చేరారు. దీంతో ఉదరు సావంత్‌తో కలిపి తొమ్మిది మంది మంత్రులు రెబల్‌ శిబిరానికి చేరుకున్నట్లు సమాచారం.

తమకు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నందున అనర్హత వేటు చట్టాన్ని అమలు చేయకుండా అసెంబ్లీలో పార్టీని చీల్చేందుకు అవకాశం ఉండనుందని ఆ వర్గాలు తెలిపాయి. అయితే 20 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ థాకరేతో టచ్‌లో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ దశలో కరోనా నుంచి కోలుకున్న గవర్నర్ బిఎస్ కోషియారీ ఆదివారం అధికార నివాసంకు చేరుకొని  పోలీసు శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా తిరుగుబాటు ఎమ్యెల్యేల భద్రతపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. రెబెల్‌ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలంటూ రాష్ట్ర డీజీపీ రజనీష్‌ సేథ్‌కు కోష్యారీ లేఖ రాశారు. 

శివ సైనికులు పలు చోట్ల తిరుగుబాటు ఎమ్యెల్యేల కార్యాలయాలు, ఇళ్ళపై దాడులు చేస్తుండడంతో పరిస్థితులు అదుపు తప్పితే రాష్ట్రపతి పాలనకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసుపత్రి నుండే కేంద్ర దళాలను పంపమని గవర్నర్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలుస్తున్నది.  

 ‘కేంద్ర బలగాల ను సిద్ధం చేయండి’ అంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ లేఖ రాయడం గమనార్హం. అసమ్మతి ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే మహారాష్ట్ర పోలీసులు మౌనం గా నిలబడ్డారని, పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర బలగాలను పంపాలని గవర్నర్‌ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. 

శివసేనకు చెందిన 38 మంది (రెబెల్‌) ఎమ్మెల్యేలు, ప్రహార్‌ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి 25వ తేదీన తనకు ఒక లేఖ అందిందని, తమ కుటుంబాల భద్రత గురించి వారంతా ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం ఆదివారం 15 మంది రెబెల్ ఎంఎల్‌ఎలకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. దాదర్ ఎంఎల్‌ఎ సదా సావర్కార్ నివాసం వద్ద సిఆర్‌పిఎఫ్ బలగాలను కూడా మోహరించారు. అలాగే షిండే శిబిరంలోని ఎంఎల్‌ఎలందరి కార్యాలయాలకు పోలీసు భద్రత కల్పించారు.