`పద్మ సేతు’తో  భారత్-బంగ్లామధ్య తగ్గిన దాదాపు సగం దూరం

 
పద్మా నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బహుళార్దక సాధక ‘పద్మా’ వారధినిబంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా శనివారం ప్రారంభించడంతో భారత్ – బాంగ్లాదేశ్ ల మధ్య దూరం తగ్గింది. అందరూ ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ వంతెన అందుబాటులోకి రావడంతో రైలు, రోడ్డు, నౌకాశ్రయాల ద్వారా ప్రయాణ కాలం, దూరం తగ్గుతాయి. 
 
రోడ్డు, రైలు మార్గాలు కలిగివును ఈ వంతెన..దేశంలోనే అతి పొడవైనది కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా నుండి. ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఈ వంతెన గణనీయంగా తగ్గిస్తుంది. అదే విధంగా,  దేశంలో వెనుకబడిన నైరుతి ప్రాంతానిు ఢాకాతోపాటు మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తుంది.
 
 జాతికి అంకితం చేసిన అనంతరం షేక్‌ హసీనా మాట్లాడుతూ ఇది కేవలం ఇటుకలు, సిమెంటు, ఉక్కు, కాంక్రీట్‌ కలగలిపిన నిర్మాణం మాత్రమే కాదని, మన శక్తి సామర్థ్యాలకు, గౌరవానికి చిహుమని తెలిపారు. బంగ్లాదేశ్‌లోని 17 కోట్ల ప్రజల కల సాకారమైందనీ, ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన విషయంలో షేక్‌ హసీనా ప్రభుత్వం ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యపడిందని సంబంధిత అధికార వర్గాలు అభివర్ణించాయి.
పద్మ వంతెన  ప్రారంభోత్సవం సందర్భంగా భారత ఎంబసీ శుభాకాంక్షలు తెలిపింది,  షేక్ హసీనాను ప్రశంసించింది. ఆమె సాహసోపేత నిర్ణయాలు, దార్శనిక నాయకత్వాలకు సజీవ సాక్ష్యం ఈ వంతెన అని పేర్కొంది. ఆమె దృఢ నిశ్చయం ఈ విజయంతో రుజువైందని పేర్కొంది. దీనికి సాటిలేని రీతిలో భారత్ మద్దతిచ్చిందని తెలిపింది.
బంగ్లాదేశ్ 1971లో ఏర్పడింది. అప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో పద్మ వంతెన ప్రాజెక్టు అతి పెద్దది. రైలు, రోడ్డు, నౌకాశ్రయాల ద్వారా భారత్‌ను నేరుగా బంగ్లాదేశ్‌తో కలిపే ఈ వంతెన పొడవు దాదాపు 6.2 కిలోమీటర్లు. ఇది నాలుగు లేన్ల రోడ్డు, రైలు వంతెన. పద్మ నదిపై దీనిని నిర్మించారు.
బంగ్లాదేశ్ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇంచుమించు 3 కోట్ల మంది జీవితాలను మార్చుతుందని చెప్తున్నారు.  ఈ వంతెనకు చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిని పూర్తిగా స్వదేశీ నిధులతో నిర్మించారు. దీని నిర్మాణం కోసం 1.2 బిలియన్ డాలర్ల రుణం ఇస్తామని ప్రపంచ బ్యాంకు చెప్పినప్పటికీ, అవినీతిని సాకుగా చూపి, ఆ రుణాన్ని రద్దు చేస్తున్నట్లు 2012లో ప్రకటించింది.
భారత దేశ సరిహద్దుల్లోని బేనపోల్ నుంచి నుంచి బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా దూరం రోడ్డు మార్గంలో ఈ వంతెన వల్ల దాదాపు 70 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఫలితంగా ప్రయాణ కాలం 4.30 గంటలు ఆదా అవుతుంది. అంతేకాకుండా కోల్‌కతా-ఢాకా రైలు ప్రయాణ కాలం సగానికి తగ్గిపోతుంది.
భారత్, నేపాల్, చైనా, మయన్మార్, సింగపూర్, థాయ్‌లాండ్‌లను పద్మ వంతెన అనుసంధానం చేస్తోంది. ట్రాన్స్ ఆసియన్ హైవే నెట్‌వర్క్ లో ఇది ముఖ్యమైనది. దీనిలో 16 రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటిలో మూడు మార్గాలు బంగ్లాదేశ్ గుండా వెళ్తున్నాయి. రైల్ లింక్ మరో రెండు మార్గాలను కలుపుతుంది.
ప్రధాన వంతెన పొడవు మొత్తం 6.15 కిలోమీటర్లు. ఇందులో రైల్వే వయాడక్ట్‌ పొడవు 532 మీటర్లు కాగా, నాలుగు లేన్ల రోడ్డు వయాడక్ట్‌ పొడవు 3.14 కి.మీ. దీనికి దాదాపు రూ.29 వేల కోట్లు ఖర్చు అయింది.  2015లో ప్రారంభమై 2022 జూన్‌ నాటికి పూర్తయింది. చైనాకు చెందిన రైల్వే మేజర్‌ బ్రిడ్జ్‌ ఇంజినీరింగ్‌ గ్రూప్‌ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది.