కేసీఆర్ సర్కార్ కు మరో 529 రోజులు మాత్రమే

తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 529 రోజులు మాత్రమే మిగిలాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. భూటకపు హామీల కేసీఆర్ సర్కార్ కు ప్రజలు వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని తెలిపారు. ఈ 529 రోజుల్లో ప్రతి దినం బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన ప్రకటించారు.
టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, బూటకపు హామీలను ఎండగడుతూ, కుటుంబ వాద పాలనను గుర్తు చేస్తూ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతుందని మీడియా సమావేశంలో తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ పాలనకు సంబంధించిన కౌంట్ డౌన్ ను లెక్కించే తెలంగాణ బిజెపి రూపొందించిన వెబ్ సైట్ ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు.
‘‘ఇకపై తెలంగాణ బీజేపీ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ కౌంట్ డౌన్  బోర్డును వినియోగిస్తాం. ప్రతి బీజేపీ కార్యాలయం ముందు ఈ బోర్డును ఏర్పాటుచేస్తాం’’ అని తరుణ్ చుగ్ వెల్లడించారు.  కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ కలలను చూపించి, బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని సాకారం చేసుకున్నారని ధ్వజమెత్తారు.
 కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు సహా ఎంతోమంది కేసీఆర్ కుటుంబీకుల చేతిలో తెలంగాణ బందీగా మారిందని తరుణ్ చుగ్  మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము చేసిన త్యాగాలను వృథా చేసేలా కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారనే ఆందోళన తెలంగాణ ఉద్యమకారుల్లో గూడుకట్టుకుందని ఆయన చెప్పారు.
కాగా, జూలై 1న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యదర్శుల భేటీ జరుగుతుందని తరుణ్ చుగ్ తెలిపారు. ఇందులో 138 మంది బీజేపీ ఆఫీస్ బేరర్లు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండాపై, చేయాల్సిన తీర్మానాల గురించి నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. ఇక జూలై 2న ఉదయం బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 3వ తేదీన సాయంత్రం 5 గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయని వివరించారు. దీనికి మొత్తం 340 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
జూన్ 3న సాయంత్రం  సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర నాయకులు, 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని చెప్పారు.  మోదీ సభ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. 
 
ఎనిమిదేళ్ల మోదీ పాలనా, తెలంగాణాలో కేసీఆర్ పాలనాలపై బహిరంగ చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని తరుణ్ ఛుగ్ సవాల్ చేశారు.  రాష్ట్రంలో అన్ని వర్గాలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ధ్వజమెత్తారు.  దళితులకు మూడెకరాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జంతర్ మంతర్ తాంత్రిక్ సర్కార్ నడుస్తోందని తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.