తుఫాన్ ప్రభావిత తీరప్రాంతాల్లో ప్రాణనష్టం లేకుండా ప్రత్యేక చర్యలు

తుపానులు, ఇతర విపత్తులతో నిత్యం నష్టపోతున్న తీరప్రాంత రాష్ట్రల్లో ప్రత్యేక పథకం చేపడుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్షా  వెల్లడించారు. అందుకై రూ 4,900 కోట్లకు పైగా నిధులతలో దేశంలోని ఎనిమిది తీరప్రాంత రాష్ట్రాల్లో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ (ఎన్ సి ఆర్ ఎం పి) అమలు చేస్తోందని తెలిపారు.

విపత్తు నిర్వహణపై హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగీస్తూ గత ఎనిమిదేళ్లలో విపత్తు నిర్వహణకు బడ్జెట్ కేటాయింపులను ప్రధాని నరేంద్ర మోదీ  122 శాతం పెంచారని, ఇది విపత్తు నిర్వహణకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందని కమిటీ సభ్యులకు తెలియజేశారు. 

కమ్యూనిటీ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ‘ఆప్దమిత్ర’ కార్యక్రమం కింద 350 విపత్తు పీడిత జిల్లాల్లో లక్ష మంది కమ్యూనిటీ వలంటీర్లకు విపత్తు ప్రతిస్పందన కోసం శిక్షణ ఇస్తున్నట్లు షా చెప్పారు.  దీనికి గాను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, పోర్టల్ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేశామని చెప్పారు.

తద్వారా రాబోయే ప్రకృతి విపత్తు గురించి ప్రజలకు ముందస్తు హెచ్చరికలను పంపవచ్చని పేర్కొన్నారు. ముందస్తు హెచ్చరికల చివరి మైలు వ్యాప్తిని పటిష్టం చేసేందుకు దేశవ్యాప్తంగా ‘కామన్ అలర్ట్ ప్రోటోకాల్’ ప్రాజెక్టును కూడా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ప్రభుత్వ విజయవంతమైన ప్రయత్నాల వల్ల కొన్నేళ్లుగా సంభవించిన వివిధ విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం బాగా తగ్గిందని అమిత్ షా చెప్పారు. 1999లో ఒడిశాలో సంభవించిన సూపర్ సైక్లోన్‌లో సుమారు 10వేల మంది ప్రాణాలు కోల్పోగా.. ఈమధ్య వచ్చిన తుఫానులలో కొంతమంది మాత్రమే మరణించారని అమిత్ షా పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రాణ నష్టం లేకుండా చూశామని చెబుతూ రాష్ట్రాల నుంచి వచ్చే మెమోరాండం కోసం ఎదురుచూడకుండా తీవ్ర విపత్తుతో రాష్ట్రాలు ప్రభావితమైన వెంటనే ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌లను రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు హోంమంత్రి తెలియజేశారు.

జాతీయ, రాష్ట్ర స్థాయిలో తొలిసారిగా ఉపశమన నిధులను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి తెలియజేశారు. 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో జాతీయ విపత్తు నివారణ నిధికి రూ.13,693 కోట్లు, రాష్ట్ర విపత్తు నివారణ నిధికి రూ.32,031 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్)ని బలోపేతం చేయడం, ఆధునీకరించడంతోపాటు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు షా చెప్పారు.

విపత్తు నిర్వహణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొంటూ 2047లో స్వాతంత్య్ర శత వార్షికోత్సవం పూర్తయ్యే నాటికి ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి హోం మంత్రిత్వ శాఖ, ఎన్‌డిఎంఎ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌లు పట్టుదలతో పనిచేస్తున్నాయని తెలిపారు.