జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణాలో అధికారం బీజేపీదే!

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారం చేబట్టబోయెడిది బిజెపి మాత్రమే అన్న స్పష్టమైన సందేశం ప్రజలకు చేరే విధంగా వచ్చే నెల మొదట్లో హైదరాబాద్ లో జరుప తలపెట్టిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ ఉండాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ నాయకులకు స్పష్టం చేసింది. 
హైదరాబాద్‌లో వచ్చే నెల 1-4 తేదీల్లో నిర్వహించే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఆ దేశంలో ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం సూచించింది.
 సమావేశాల ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ్‌ ప్రకాశ్‌ సమీక్షించారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రత్యేకత ఉందని చెప్పారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని చెప్పారు.
 అంతేకాకుండా, తెలంగాణ రాజకీయ పరిణామాల రీత్యా రాష్ట్రంలో ఆయా వర్గాలతో సమ్మేళనాలను నిర్వహిస్తామని, హైదరాబాద్‌ మినీ భారత్‌గా ఉన్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారితో కూడా సమ్మేళనాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత పెరిగిపోయి, తమవైపు చూస్తున్న ప్రజలకు ఈ సమావేశాలు భరోసా నింపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 టీఆర్‌ఎస్‌ విస్మరించిన ఉద్యమ ఆకాంక్షలు, చరిత్రను చాటిచెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, తెలంగాణ ఉద్యమం, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల చరిత్రపై ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని చెప్పారు.
టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలపై ప్రజలకు నమ్మకం పోయిందని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు ఒక గూటి పక్షులేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.