గోల్డ్ స్మగ్లింగ్ పై సీబీఐ విచార‌ణ.. స్వప్నా సురేష్

కేరళ రాజకీయాలలో కలకలం రేపుతున్న కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పునరాయి విజయం ప్రత్యక్ష ప్రమేయం ఉన్నదని కోర్ట్ లో తీవ్రమైన ఆరోపణలు చేసిన ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్  ప్రధాని నరేంద్ర మోదీకి వ్రాసిన లేఖలో సీబీఐ విచార‌ణకు ఆదేశించాలని కోరారు.  కేర‌ళ ముఖ్యమంత్రి పినరయి విజ‌య‌న్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై బంగారం స్మగ్లింగ్ కేసులో సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆ లేఖలో ఆమె  కోరారు.
 
రాష్ర్ట  ప్రభుత్వ జోక్యం వ‌ల్లే ఈ కేసును క‌స్టమ్స్‌, ఎన్ఐఏకు అప్పగించిన‌ట్లు ఆమె తెలిపారు. అయితే  ఆ రెండు ఏజెన్సీలు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచార‌ణ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖ‌లో స్వప్నా సురేష్ ఫిర్యాదు చేశారు. మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చిన త‌ర్వాత త‌న‌తో పాటు త‌న కుటుంబ సభ్యులు, బంధువులు, న్యాయవాదిపై వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేర‌ళ ప్రభుత్వం త‌మ‌ను ఇరికించింద‌ని, త‌మ స్వార్థం కోసం బ‌లి ప‌శువును చేసింద‌ని  ఆమె ఆరోపించారు. వ్యక్తిగ‌తంగా ప్రధానిని క‌లిసి, త‌న ప‌రిస్థితిని వివ‌రించాల‌నుకుంటున్నట్లు ఆ లేఖ‌లో ఆమె  తెలిపారు. ‘వాస్తవానికి ఈ స్మగ్లింగ్‌కు పాల్పడిన వ్యక్తి ఐఎఎస్  అధికారి, శివశంకర్ (కేరళ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి) అని మీ దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నాను. నాలాంటి చాలామంది ఉద్యోగులు ఈ స్కామ్ లో ఇరుక్కోవాల్సి వచ్చింది’ అంటూ లేఖలో స్వప్నా సురేష్ ఆరోపించారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేస్తూ .తనను దాదాపు 16 నెలల పాటు జైలులో పెట్టారని, శివశంకర్ మాత్రం మూడు నెలలు జైల్లో గడిపారని, ఆ తర్వాత అతనికి కేరళ ప్రభుత్వం బెయిల్ వచ్చేలా చేసిందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ గౌరవప్రదమైన ఉద్యోగం కూడా కల్పించిందని ఆమె ఆరోపించారు.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకుంటే అమాయకులైన తన లాంటి వారు నిందితులుగా శిక్షింపబడుతారని, అసలు నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసును గతంలో భారత్ లో జరిగిన బోఫోర్స్, వేదాంత, 2జి స్పెక్ట్రమ్ వంటి కుంభకోణాలతో  ఆమె  పోల్చారు. ఈ కేసులో నిజనిజాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు.
2016లో దుబాయ్‌లో ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరెన్సీ ఉన్న బ్యాగేజీని పంపినట్లు ఆమె చెప్పారు. యూఏఈ నుంచి కేరళకు దిగుమతి చేసుకున్న 17 టన్నుల ఖర్జూరం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మాజీ మంత్రి కేటీ జలీల్‌కు తెలియకుండానే మాయమైపోయిందని స్వప్న సురేష్‌ సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఈ కేసును విచారిస్తున్నాయి.