కాశ్మీర్ లో ఎన్ఐఏ దాడులు … పలువురి నిర్బంధం

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం ఉగ్రవాదంపై  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) తాజా దాడులు జరిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహకారంతో హబ్బా-కాదల్, సూత్రషహి ఏరియాలో ఈ దాడులు చేపట్టింది.
 హబ్బా కాదల్‌ నివాసి నజీర్ అహ్మద్, సూత్రసహిలో ఉంటున్న షా ఫైజల్ అనే వ్యక్తిని ఎన్ఐఏ నిర్బంధంలోకి తీసుకుని శ్రీనగర్‌లోని షహీద్ జుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లింది. అనంతరం, స్కిమ్స్ (ఎస్‌కేఐఎంఎస్) సౌర ఆసుపత్రిపై దాడి జరిపి ఇర్షాద్ అహ్మద్ ఎలాహి అనే 24 ఏళ్ల యువకుడిని అదుపులోనికి తీసుకుంది.
 
కాగా, రెండ్రోజుల క్రితం కూడా పుల్వామా జిల్లాలో ఎన్ఐఏ దాడులు జరిపి పలువురిని నిర్బంధంలోకి తీసుకుంది. పుల్వామాలోని దరస్‌గఢ్ ప్రాంతంలో గత మార్చి11న భద్రతా దళాలపై దాడి జరిగింది. దానిపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ తాజాగా దాడులు జరిపింది. 
 
ఈనెల 16న కూడా బారాముల్లా జిల్లాలో ఎన్ఐఏ రెయిడ్స్ జరిపింది. సీఆర్‌పీతో కలిపి జరిపిన ఈ దాడుల్లో పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్లను సీజ్ చేసింది.
 
జమ్మూ కశ్మీరులో భారీ వర్షాలు
 
ఇలా ఉండగా, జమ్మూ కశ్మీరులో భారీ వర్షాలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఒక వంతెనతోపాటు 150 అడుగుల రోడ్డు కొట్టుకుపోయాయి. రాంబన్, ఉధంపూర్ జిల్లాలలో కొండ చరియలు విరిగి పడుతుండడంతో రోడ్డు రవాణాకు వరుసగా రెండో రోజు ఆటంకాలు ఏర్పడ్డాయి.
 ఉధంపూర్ జిల్లాలో తోల్డి నల్లా సమీపంలో జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై 150 అడుగుల రోడ్డు వరదల్లో కొట్టుకుపోయింది. జమ్మూ ప్రాంతంలోని పూంచ్, రాజోరి జిల్లాలను కలిపే మొఘల్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
తావీ నది పొంగి ప్రవేహిస్తుండడంతో అనేక చోట్ల వరదలు సంభవించి రహదారులు జలమయమైనట్లు అధికారులు తెలిపారు. రాంబన్, ఉధంపూర్ జిల్లాలలోని 270 కిలోమీటర్ల రహదారిపై 33 చోట్ల కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు చెప్పారు.