అగ్నివీర్ల భర్తీకి జూలై నుంచి రిజిస్ట్రేషన్లు

‘అగ్నిపథ్’ స్కీమ్ లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ను  సైన్యం సోమవారం విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలతుందని వెల్లడించింది. అగ్నివీరులుగా నియామకాలు చేపట్టే విభాగాలు, అందుకు కావాల్సిన అర్హతలను తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అగ్నివీరులకిచ్చే వేతన ప్యాకేజీ, సెలవులు, నిబంధనల వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. న్యూ రిక్రూట్‌మెంట్ స్కీమ్ తొలి రౌండ్ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండియన్ ఆర్మీలో డిస్ట్కింక్ట్ ర్యాంక్‌గా అగ్నివీర్ ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతమున్న ఇతర ర్యాంకులకు ఇది భిన్నమని పేర్కొంది.
భారత సైన్యంలోకి ప్రవేశించాలనుకునే వారికి అగ్నిపథ్ స్కీమ్ ఒక్కటే మార్గమని నోటిఫికేషన్ లో ప్రస్తావించారు. కేవలం సైన్యంలోని మెడికల్ బ్రాంచ్ కు చెందిన టెక్నికల్ క్యాడర్ భర్తీ ప్రక్రియ కోసం మాత్రమే ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడుతాయని స్పష్టం చేశారు.
 కాగా, భారత నౌకాదళంలో అగ్ని వీర్ల భర్తీకి జూన్ 21న, వాయుసేనలో భర్తీకి జూన్ 24న నోటిఫికేషన్లు వెలువడుతాయని ట్విటర్ హ్యాండిల్ లో ఆర్మీ ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవాలని భావించే వారు తప్పకుండా త్రివిధ దళాల వెబ్ సైట్ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని నిర్దేశించింది.

అగ్నివీరులకు కార్పొరేటు దిగ్గజాల భరోసా

అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశం కల్పిస్తామంటూ పలువురు  దేశీయ కార్పొరేటు దిగ్గజాలు ప్రకటనలు చేస్తున్నారు. మొదటగా, మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా ప్రకటన చేయగా, ఆయన సరసన మరో కార్పొరేటు దిగ్గజం, ఆర్‌పీజీ గ్రూప్  చైర్మన్ హర్ష గోయెంకా కూడా చేరారు.
ఆనంద్ మహింద్రా  ట్వీట్‌ను జతచేస్తూ..  అగ్నివీరుల నియామకానికి ఆర్‌పీజీ గ్రూపు ఉపాధి అవకాశాలు కూడా స్వాగతం పలుకుతాయని హర్ష గోయెంకా భరోసా కల్పించారు. ఇతర కార్పొరేట్లు కూడా తమలాగే ప్రతిజ్ఞ చేస్తారని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘ మన యువత భవితకు భరోసా కల్పిద్దాం’’ అని హర్ష గోయెంకా వ్యాఖ్యానించారు.
మహింద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహింద్రా గురువారం ఉదయం ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘‘ అగ్నిపథ్ పథకం కేంద్రకంగా కొనసాగుతున్న హింసపట్ల విచారిస్తున్నాను. ఈ స్కీమ్ చివరి ఏడాదికి చేరుకున్నాక అగ్నివీరుల క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి అపార ఉపాధి అవకాశాలను తెచ్చిపెడతాయి” అంటూ తెలిపారు.
అలాంటి సుశిక్షిత, సామర్థ్యం కలిగిన యువతకు మహింద్రా గ్రూప్ ఉపాధి అవకాశాలు కూడా స్వాగతం పలుకుతాయని ఆనంద్ మహింద్రా హామీ ఇచ్చారు. దీంతో ప్రత్యక్షంగా అగ్నిపథ్ పథకాన్ని స్వాగతించినట్టయింది.