హర్యానాలో 25 మునిసిపాలిటీలలో బీజేపీ-జేజేపీ కూటమి!

అధికార బిజెపి-జేజేపీ కూటమిి హర్యానాలో జరిగినమునిసిపల్ ఎన్నికలలో అత్యధిక పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను కైవసం చేసుకోగలిగింది, అగ్నిపథ్ నిరసనలు ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపలేదని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతా తెరవగా, కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు అధ్వాన ఫలితాలు పొందారు.

34 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 22, జేజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. 18 పురపాలక సంఘాలు, 28 కమిటీల అధ్యక్షులు, సభ్యుల కోసం జరిగిన ఎన్నికల్లో 70 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. 20 కమిటీలు, 14 కౌన్సిల్‌ల నుంచి పార్టీ గుర్తుపై పోటీ చేసిన బీజేపీ వరుసగా 12, 10 అధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది.

 
జేజేపి నుహ్, షహబాద్, చీకా గెలుచుకుంది. కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ పార్టీ గుర్తుపై పోటీ చేయలేదు, స్వతంత్రులకు మద్దతు అవ్వగా, వారిలో ఆరుగురు మాత్రమే గెలిచారు.  ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడాకు బలమైన ప్రాంతాలుగా పరిగణించే ఝజ్జర్, బహదూర్‌ఘర్‌లలో సహితం పేలవమైన ఫలితాలు పొందారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా బలపరిచిన అభ్యర్థి కూడా కైతాల్‌ నుంచి ఓడిపోయారు.

తొలిసారిగా ఆప్ ఇస్మాయిలాబాద్ సీటును గెలుచుకోగా, కాంగ్రెస్ బలపరిచిన వారితో సహా స్వతంత్రులు 19 స్థానాలను గెలుచుకున్నారు. ఐ ఎన్ ఎల్ డి సహితం పేలవమైన ఫలితాలు పొందింది. కేవలం మండి దబ్వాలి సీటును మాత్రమే గెలుచుకుంది.

సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు గ్రామీణ ఓటర్ల మనోభావాలను ప్రతిబింబించవు. అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న అనేక మంది చిన్న పట్టణాల్లో నివసిస్తున్నారు.  మరికొందరు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉండటంతో, రైతుల ఆందోళన సమయంలో బిజెపి ఎదుర్కొన్న రాజకీయ నష్టాన్ని బిజెపి తిరిగి భర్తీ చేసుకోగలుగుతున్నట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. 
 
ఆసక్తికరంగా, రైతుల ఆందోళన సమయంలో జరిగిన బరోడా (కాంగ్రెస్‌ గెలిచింది), ఎల్లెనాబాద్‌ (ఐఎన్‌ఎల్‌డి గెలిచింది) – రెండు ఉపఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నెలల తరబడి వాయిదా పడ్డాయి. పైగా, బిజెపి ఇటీవలి సాధించిన అసెంబ్లీ ఎన్నికల విజయాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో, రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌లో నైతిక స్థైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడింది, ఇది కొత్త శక్తితో ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి దోహదపడింది.