విస్మయం కలిగిస్తున్న ద్రౌపది ముర్మూ నిరాడంబర జీవనం 

రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ఎంపిక చేసిన  ద్రౌపది ముర్ము నిరాడంబర జీవనం అందరికి విస్మయం కలిగిస్తోంది. కాబోయే రాష్ట్రపతిగా ఆమె పేరు ప్రకటించగానే  బుధవారం ఉదయం ఒడిషాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి వెళ్లారు. అనంతరం ఆమె.. చీపురు చేతపట్టి స్వతహాగా ఆలయాన్ని శుభ్రం చేశారు.

ఆ తర్వాత శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే, రాష్ట్రపతి రేసులో ఉన్న ఆమె.. ఇలా చీపురు పట్టుకుని శుభ్రం చేయడం అక్కడున్న వారితో సహా పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయా స్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని పేర్కొన్నారు.

జడ్ ప్లస్ కేటగిరి భద్రత

కాగా, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్మూకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. మంగళవారం సాయంత్రం ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మూను ప్రకటించిన నేపథ్యంలో ఆమెకు సెక్యూరిటీ కల్పించారు.

 జడ్ ప్లస్ సెక్యూరిటీ  కవర్ ప్రకారం సీఆర్‌పీఎఫ్ కమాండోలతో రక్షణ ఏర్పాటు చేశారు.  సీఆర్పీఎఫ్ ద‌ళాలు ఆమెకు భద్రత ఇవ్వ‌నున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.