మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి 5 సీట్లు కైవసం 

మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయం దక్కింది. అసెంబ్లీలో బీజేపీకి ఉన్న బలం ఆధారంగా చూస్తే 4 ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలవగలదు. అయితే అధికార కూటమి ఎమ్మెల్యేల క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా బీజేపీ 1 స్థానాన్ని అదనంగా గెలుచుకుంది.
ఇటీవలనే రాజ్యసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిని ఓడించి, అదనంగా ఓ సీట్ గెలుపొందిన ఉత్సాహంతో ఉన్న బిజెపికి ఈ ఫలితాలు మరింత బలం కలిగించాయి.  మొత్తంగా 10 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగ్గా  బీజేపీకి 5, శివసేన నేతృత్వంలోని అధికార కూటమికి 5 స్థానాలు దక్కాయి.
ఏ పార్టీకీ బలం సరిపోని 10వ స్థానం కోసం ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఒక బీజేపీ అభ్యర్థి పోటీపడ్డారు. చివరకు క్రాస్‌ ఓటింగ్‌తో బీజేపీ లాభపడింది. బీజేపీ అభ్యర్థి ప్రసాద్‌ లాద్‌ విజయం సాధించారు. శివసేన, ఎన్సీపీ చెరో 2 స్థానాలు, కాంగ్రెస్‌ 1 స్థానం దక్కించుకున్నాయి.
బిజెపి అభ్యర్థులు ప్రవీణ్ దారేకర్, రామ్ షిండే, శ్రీకాంత్ భారతీయ, ఉమా కాప్రీ, ప్రసాద్ లాద్ – అందరూ గెలుపొందారు. ఎన్సీపీ  అభ్యర్థులుగా  రాంరాజే నింబాల్కర్, ఎకనాథ్ ఖడ్సే, శివ సేన అభ్యర్థులుగా ఆంష్య పదవి, సచిన్ అహిర్, కాంగ్రెస్ అభ్యర్థి భాయ్ జగ్తాప్గెలుపొందారు.
 అసెంబ్లీలో 44 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఉండగా, 41మంది మాత్రమే ఆ పార్టీకి ఓటు వేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. మరోసారి మహారాష్ట్ర తమ పట్ల నమ్మకం చూపడం పట్ల బిజెపి హర్షం ప్రకటించింది.
బిజెపికి మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులకు శివసేన కూటమి పట్ల విశ్వాసం కోల్పోయిన్నట్లు స్పష్టం అవుతున్నదని గెలుపొందిన బిజెపి అభ్యర్థి ప్రవీణ్ దారేకర్ తెలిపారు. శివసేన, కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ లేకుండా తమకు అన్ని ఓట్లు వచ్చి ఉండేవికావని స్పష్టం చేశారు.