కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. సత్ఫలితాల్నిస్తాయి

సైనికుల భర్తీకి ఉద్దేశించిన ‘అగ్నిపథ్’ స్కీమ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  ‘‘కొన్ని నిర్ణయాలు ప్రస్తుతానికి సహేతుకంగా కనిపించవచ్చు. కానీ అవే దీర్ఘకాలంలో దేశ నిర్మాణానికి దోహదం చేస్తాయి’’ అని స్పష్టం చేశారు.
‘స్టార్టప్, ఇన్నోవేషన్‌‌ల దారిలో నడవడం అంత సులభం కాదు. ఈ మార్గంలో దేశాన్ని నడిపించడం కూడా అంత ఈజీ కాదు. పలు నిర్ణయాలు, సంస్కరణలు తాత్కాలికంగా చెడ్డవిగా కనిపించవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ వాటి ప్రయోజనాలను దేశం అనుభవిస్తుంది’ అని ప్రధాని వివరించారు.
21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి సృష్టికర్తలు, ఆవిష్కర్తలకు చెందినదని, వారే దేశానికి నిజమైన బలమని చెబుతూ  ఎనిమిదేండ్లుగా తమ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని ప్రధాని తెలిపారు. సంస్కరణలు మాత్రమే మనల్ని కొత్త లక్ష్యాల వైపు, కొత్త సంకల్పాల వైపు తీసుకెళ్తాయని స్పష్టం చేసారు.
దశాబ్దాలుగా అంతరిక్ష, రక్షణ రంగాలకు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయని, అయితే ఇప్పుడు వాటి తలుపులు తెరిచామని ప్రధాని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి, ప్రజల జీవితాల్లో జోక్యాన్ని తగ్గించుకుంటే దేశ యువత ఏంచేయగలరో బెంగళూరు చూపెట్టిందని ప్రధాని కొనియాడారు.
బెంగళూరు.. దేశ యువతకు కలల నగరమని చెబుతూ  ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్, ఇన్నొవేషన్, ప్రైవేటు, పబ్లిక్ సెక్టార్లను ఉపయోగించుకునే హక్కు వంటివి ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశపెడుతున్న సంస్కరణల ఫలితాలను రానున్న రోజుల్లో ప్రజలు కళ్లారా చూస్తారని భరోసా వ్యక్తం చేశారు.
 ‘‘నేను సమయాన్ని వృధా చేసుకోకుండా.. ప్రతిక్షణం దేశ సేవకు కృషిచేస్తాను’’ అని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు.  కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా, తర్వాత కాలంలో వాటి ప్రయోజనాలను దేశం గ్రహిస్తుందని ప్రధాని  చెప్పారు.  అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు, మాజీ సైనికారులు, నిరుద్యోగుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శన నేపథ్యంలోనే ప్రధాని సంస్కరణల ఫలాల గురించి ప్రస్తావించడం గమనార్హం.
 ఒక దాన్ని కనుగొనడం, ప్రారంభించడం అంత తేలికేమీ కాదని అంటూ, ఎనిమిదేళ్లుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించటం కూడా అంత తేలిక కాదని ప్రధాని చెప్పారు.  సంస్కరణలు తాత్కాలికంగా ఇబ్బందిగా అనిపించి.నా, దీర్ఘకాలంలో వాటి ఫలితాలు ప్రజలకు అనుభవంలోకి వస్తాయని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ రంగంలో సరళీకరణ వల్ల అనేక కొత్త లక్ష్యాలు , కొత్త పరిష్కారాలకు దారి చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తే యువతరం ఎలాంటి వాటిని సాధించగలదో బెంగళూర్‌ యువతే నిదర్శనమని కొనియాడారు. ఇక్కడ ఎందరో వ్యాపార వేత్తలుగా మారరని, ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగాయని చెబుతూ ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం దోహదపడిందని పేర్కొన్నారు.  బెంగళూర్‌ నగరంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
యలహంక ఎయిర్‌‌‌‌ఫోర్స్ స్టేషన్‌‌కు చేరుకున్న ప్రధానికి గవర్నర్ థావర్‌‌‌‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంతి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యెడియూరప్ప తదితరులు స్వాగతం పలికారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(బేస్‌‌) క్యాంపస్‌‌ను ప్రారంభించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కర్నాటకవ్యాప్తంగా ఐటీఐలను మార్చడం ద్వారా అభివృద్ధి చేసిన 150 టెక్నాలజీ హబ్‌‌లను కూడా ఆవిష్కరించారు. రూ 280 కోట్లతో ఐఐఎస్‌‌సీలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్‌‌(సీబీఆర్)ను ప్రధాని ప్రారంభించారు. బగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌‌కు పునాదిరాయి వేశారు.