చెస్‌ ఒలింపియాడ్‌ టార్చ్‌ రిలేను ప్రారంభించిన ప్రధాని

ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ కోసం ఒలింపిక్స్‌ మాదిరి ఈసారి భారత్‌లో శ్రీకారం చుట్టిన టార్చ్‌ రిలే దేశ రాజధానిలో ఘనంగా మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ జ్యోతి రిలేను ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కడి వోర్కోవిచ్‌ తొలి టార్చ్‌ బేరర్‌ కాగా, దీనిని అందుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత చెస్‌ సూపర్‌ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌కు అందించారు.

క్రీడా సమాఖ్య చీఫ్, ప్రధాని, చెస్‌ దిగ్గజం… ఇలా విభిన్న అతిరథుల మధ్య టార్చ్‌ రిలే వైభవంగా మొదలైంది. ఇక్కడి నుంచి ఇకపై 40 రోజుల పాటు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా భారతావనిని ఈ జ్యోతి చుట్టి వస్తుంది.  వివిధ రాష్ట్రాలకు చెందిన 75 నగరాల్లో టార్చ్‌ రిలే కార్యక్రమం జరుగుతుంది. రెండేళ్లకోసారి నిర్వహించే చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యమిచ్చేది ఏ దేశమైనా టార్చ్‌ రిలే మాత్రం భారత్‌లోనే మొదలవుతుందని ఫిడే ప్రకటించడం దేశానికి గర్వకారణం.

 లేహ్, శ్రీనగర్, జైపూర్, సూరత్, ముంబై, భోపాల్, పట్నా, కోల్‌కతా, గ్యాంగ్‌టక్, హైదరాబాద్, బెంగళూరు, పోర్ట్‌బ్లెయిర్, కన్యాకుమారిల మీదుగా సాగే రిలే చివరకు ఆతిథ్య వేదిక అయిన తమిళనాడులోని మహాబలిపురంన కు చేరుకుంటుంది. ఏ రాష్ట్రానికి వెళితే అక్కడి గ్రాండ్‌మాస్టర్లు జ్యోతిని అందుకుంటారు.

చెస్‌ ఒలింపియాడ్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. శతవసంతాల సమయంలో తొలిసారి భారత్‌ లో ఈ ఈవెంట్‌ జరుగుతోంది. మొత్తం 188 దేశాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘చెస్‌ పురిటిగడ్డపై చెస్‌ ఒలింపియాడ్‌ ప్రప్రథమ టార్చ్‌ రిలేకు అంకురార్పణ జరగడం గర్వంగా ఉంది. చదరంగం పుట్టిన దేశంలో చెస్‌ ఒలింపియాడ్‌ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇలా జ్యోతి రిలే భారత్‌లో మొదలవడం దేశానికే కాదు… చెస్‌ క్రీడకే గౌరవం పెంచినట్లయింది’ అని పేర్కొన్నారు.

చెస్‌ కేవలం ఆట కాదని, అది విద్యా సాధనమని ప్రధాని అభివర్ణించారు. ‘విశ్లేషణ నైపుణ్యాలకోసం మన పూర్వీకులు చెస్‌ను కనిపెట్టారు. ఇప్పుడు ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. నేడు ఈ క్రీడ విద్యా సాధనంగా మారిపోయింది. చెస్‌ క్రీడాకారులు సమస్యల పరిష్కారకులుగా మారుతున్నారు’ అని తెలిపారు. చెస్‌లో విజయాలు సాధించడంలో యోగా, ధ్యానం తోడ్పడతాయని మోదీ చెప్పారు.

ఈ కార్యక్రమం సందర్భంగా భారత మహిళా తొలి గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం), ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కోనేరు హంపితో మోదీ కాసేపు సరదాగా చెస్‌ గేమ్‌ ఆడారు.   చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జూలై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెస్‌ ఒలింపియాడ్‌ జరుగుతుంది. భారత్‌ తరఫున ఓపెన్‌ విభాగంలో రెండు జట్లు, మహిళల విభాగంలో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.

2014లో ఓపెన్‌ విభాగంలో భారత జట్టు తొలిసారి కాంస్య పతకం సాధించింది. కరోనా కారణంగా 2020లో ఆన్‌లైన్‌ ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలు గా నిలువగా… 2021లో మళ్లీ ఆన్‌లైన్‌ఒలింపియాడ్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. చెస్‌లోని 64 గడులను వర్ణిస్తూ సాగిన భారత సంప్రదాయ నృత్యాలు కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచాయి.

అలాగే చెస్‌ పురాతన చరిత్ర, అది విభిన్న రీతుల్లో మార్పులు చెంది నేడు ఎలా రూపుదిద్దుకున్నదో తెలియజేసిన వైనం వీక్షకులను కట్టిపడేసింది. కాగా టార్చ్‌ రిలే లేహ్‌, శ్రీనగర్‌, జైపూర్‌, సూరత్‌, ముంబై, భోపాల్‌, పట్నా, కోల్‌కతా, గ్యాంగ్‌టక్‌, హైదరాబాద్‌, బెంగళూరు తదితర నగరాల గుండా సాగుతుంది.