టీ తాగడంపై ఆంక్షలు విధించిన పాక్ 

 
పాకిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో, దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దారిలోకి తీసుకు రావాలో తెలియక అక్కడి ప్రభుత్వం అతలాకుతలమై పోతున్నది. పతనం అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఒక ఫెడరల్ మంత్రి పౌరులను కోరినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం నిరాశ, నిస్పృహలు ఎంతటి పతాక స్థాయికి చేరుకున్నాయి వెల్లడయింది.

ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నంలో “ఒక కప్పు టీని తగ్గించమని నేను దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను” అని ప్లానింగ్, అభివృద్ధి, ప్రత్యేక కార్యక్రమాల మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ప్రకటించారు. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతుండడంతో దేశంలో దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడానికి దేశ ప్రజలు తేనీరు సేవనంపై త్యాగం చేయాలని ఆయన కోరారు.

 
పాకిస్థాన్  ప్రస్తుతం పెను విపత్తు అంచున కొట్టుమిట్టాడుతోంది. ఒక వంక,  తీవ్రవాదంతో ముడిపడి ఉన్న దీర్ఘకాల రాజకీయ సంక్షోభం ఉంది. మరోవంక,  నిరంతర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది.  పైగా, ఇదే సమయంలో సన్నిహిత మిత్రదేశం చైనా కూడా ఆపదలో ఆదుకోవడంలో  విఫలమైంది.
 
2021-22 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ప్రజలు రూ. 83.88 బిలియన్ల (400 మిలియన్ అమెరికన్ డాలర్ల) విలువైన తేయాకుని వినియోగించినట్లు లెక్కలు చెబుతున్న నేపథ్యంలో మంత్రి అహ్సన్ ఇక్బాల్ దేశ ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా తేయాకును దిగుమతి చేసుకుంటున్న దేశం పాకిస్తాన్ అని, దీని దిగుమతి కోసం ప్రభుత్వం అప్పులు చేయవలసి వస్తోందని ఆయన తెలిపారు.
రుణంపై తేయాకు దిగుమతి చేసుకుంటున్న కారణంగా రోజుకు 1 లేదా 2 కప్పుల తేనీటికి ప్రజలు పరిమితం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా..మంత్రి అహ్సన్ ఇక్బాల్ తేయాకు వినియోగాన్ని తగ్గించుకోవాలని ఇచ్చిన పిలుపుపై ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్‌లో ఆయనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము టీ తాగడం తగ్గించే ప్రసక్తి లేదని వారు తెగేసి చెబుతున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద గల విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం రెండు నెలలకు మాత్రమే అన్ని దిగుమతులకు సరిపోగలవు. అదనపు వనరులను సమకూర్చుకోలేక, వినియోగంపై ఆంక్షలు విధించడం వైపు దృష్టి సారిస్తున్నారు. అదే  విధంగా,విద్యుత్ వినియోగంలో పొదుపు కోసం రాత్రి 8.30 గంటల తర్వాత వ్యాపారాలు అన్నింటిని మూసి వేయాలని ప్రభుత్వం కోరుతున్నది. 
 
పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఫిబ్రవరిలో సుమారు 16 బిలియన్ డాలర్లు ఉండగా,  జూన్ మొదటి వారంలో 10 బిలియన్ డాలర్లకంటే తక్కువకు పడిపోయాయి, ఇది రెండు నెలల దిగుమతుల ఖర్చును భరించడానికి సరిపోదు. గత నెలలో ఇస్లామాబాద్‌లోని అధికారులు నిధులను కాపాడుకోవడం కోసం  డజన్ల కొద్దీ అనవసరమైన విలాస  వస్తువుల దిగుమతిని పరిమితం చేశారు.

ఆర్థిక సంక్షోభం ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ ప్రధానిగా మార్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పెద్ద పరీక్ష గా మారింది.  ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే, షరీఫ్ ఇమ్రాన్ ఖాన్   ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహించిందని ఆరోపించారు.  దానిని తిరిగి ట్రాక్ చేయడం చాలా పెద్ద సవాల్ అని పేర్కొన్నారు.


గత వారం షరీఫ్ మంత్రివర్గం  ఆగిపోయిన 6  బిలియన్ డాలర్ల  బెయిలౌట్ కార్యక్రమాన్ని పునఃప్రారంభించటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధిని ఒప్పించే లక్ష్యంతో తాజాగా 47 బిలియన్ డాలర్ల  బడ్జెట్‌ను ఆవిష్కరించింది. తక్కువ విదేశీ కరెన్సీ రిజర్వ్ సరఫరాలు, సంవత్సరాల తరబడి నిలిచిపోయిన వృద్ధి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి ఐఎంఎఫ్ తో   2019లో చర్చలు జరిగాయి.