కెసిఆర్‌ లేదా కెటిఆర్‌ రావాల్సిందే… బాసర విద్యార్థుల స్పష్టం

కెసిఆర్‌ లేదా కెటిఆర్‌ రావాల్సిందే.. మా సమస్యను పరిష్కరించాల్సిందే ‘ అంటూ … నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు భారీగా నిరసన కొనసాగిస్తున్నారు. 
 
విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్యం నిర్లక్ష్యంపై మంగళవారం నుంచి ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. బుధవారం కూడా కొనసాగించారు. సుమారు 6 వేల మంది విద్యార్థులు భారీగా మెయిన్‌ గేటు వద్ద చేరుకొని అక్కడే బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.
 
కాగా, బాసరలో ట్రిపుల్ ఐటీ  విద్యార్థుల ఆందోళనలపై గవర్నర్ డా.  తమిళి సై సౌందరాజన్ సీరియస్ అయ్యారు. విద్యార్థుల ఆందోళనలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని వీసీని ఆదేశించారు. మరోవైపు బాసర ఘటనపై విద్యామంత్రి సబిత ఇంద్రారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించిన ఆమె వీసీపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్షణమే వీసీ హైదరాబాద్ రావాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ ట్రిపుల్ ఐటీలో కుట్రలు చేస్తోందని మంత్రి సబిత ఆరోపించారు.
 
 తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు  కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. 
 
కాగా, విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్లు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్‌ ఉండటం లేదని, వాటర్‌ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు.
 
 అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్‌ కూడా ఇవ్వడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. ఇక, రెండు సంవత్సరాల నుండి బాసర ట్రిపుల్‌ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.
 
 వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. 
మరోవైపు విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ట్రిపుల్‌ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్‌ వేదికగా హామీనిచ్చారు.
 బాసరకు వచ్చే రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇతరులెవరూ రాకుండా నిజామాబాద్ – భైంసా రూట్లలో పికెటింగ్‌లు ఏర్పాటు  చేశారు. బాసర రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.