సర్పంచుల అధికారాలకు కత్తెర వేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

తెలంగాణ లోనే కాదు దేశమంతా సర్పంచ్‌లకు స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి నిధులు, విధుల వినియోగంలో సర్వాధికారాలను కట్టబెడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకు రాగా,  రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా సర్పంచ్‌లకున్న అధికారాలకు కత్తెర వేస్తూ గ్రామ స్వరాజ్యం లక్ష్యాలను నీరు గారుస్తోందని బిజెపి ఆరోపించింది. 
 
 సర్పంచులకు అధికారాల్లేకుండా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని, అడిగితే బెదిరిస్తున్నరని, ప్రశ్నిస్తే సస్పండ్ చేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ కు  ఫిర్యాదు చేశారు.  రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుల ఆధ్వర్యంలో  సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుసహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి గవర్నర్ కు వినతి పత్రం అందించారు. 
 
అదే విధంగా గౌరవెల్లి బాధితులతో కలిసి గౌరవెల్లి నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్, పరిహారం విషయంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మరో వినతి పత్రం అందజేశారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో కనీస వసతుల్లేక, అధ్యాపకుల్లేక వేలాది మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, ఆయా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను గవర్నర్ ద్రుష్టికి తీసుకెళ్లారు.
 
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రకటించిన రూ.15 లక్షల ప్రోత్సహక నగదు ఇవ్వడం లేదని,  కేసీఆర్ ప్రభుత్వ తీరువల్ల సర్పంచులు కూలీలుగా మారుతున్నరని, ఆత్మహత్య చేసుకునేలా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ 2014లో విడుదల చేసిన మ్యానిఫెస్టో.25 పేజీలో అనే అంశం కింద స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు చేస్తామని, 73, 74 రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థలకు యుద్ధప్రాతిపదికన అధికార బదలాయింపు చేసి ఈ సంస్థలను పటిష్టం చేయాలనే ధృడనిశ్చయంతో ఉందని పేర్కొన్నారని గవర్నర్ కు తెలిపారు. అయితే పంచాయతీల అభివృద్ధికోసం టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని వారు విమర్శించారు.
 గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని,  ఒక్కో గ్రామ పంచాయతీకి రెండు లక్షల నుండి రూ 20 లక్షల వరకు ప్రభుత్వం వద్ద బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని తెలిపారు.  నిధులు మంజూరు చేసినట్లుగా జీ.వో.లు ఇస్తూ ప్రభుత్వం అకౌంట్లు ఫ్రీజ్‌ చేస్తోందని, ఇదేమని అడిగిన వారిని  సస్పెండ్‌ చేస్తామని, చెక్‌పవర్‌ రద్దు చేస్తామంటూ బెదిరిస్తూ,  అవమాన పరుస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని వారు గవర్నర్ కు వివరించారు.
గ్రామాలలో చాలా పనులకు కేంద్రమే నిధులు సమకూరుస్తున్నదని చెబుతూ మరోపక్క రాష్ట్రం తన వాటా డబ్బు చెల్లించకపోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను సైతం పక్కదారి పట్టించడం వల్ల సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పల్లెల ప్రగతి కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్‌యోజన్‌ కింద నిలవనీడలేని వారికి ఇళ్ళు ఆయుష్మాన్‌భారత్‌ కింద ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా నిధులు కేటాయిస్తున్నా, రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ భీమా పథకం కింద కేంద్ర ప్రభుత్వం తమ వాటా చెల్లిస్తున్నా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరివల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. తద్వారా గ్రామసర్పంచ్‌లపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. 
కాగా, హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేల్లి,గండి పేల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పైన పోలీసులు అక్రమ లాఠీ ఛార్జ్ చేశారని, జూన్13  అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో దాదాపు 500 మంది బలగాలతో గుడాటిపల్లి లో ప్రవేశించిన పోలీసులు ఆ గ్రామంలో కరెంట్ కట్ చేసి ప్రతి ఇంటిలోకి దౌర్జన్యంగా దూరి విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారని వారు గవర్నర్ కు తెలిపారు.  పిల్లలు, మహిళలు, వృద్దులు అని చూడకుండా పోలీసులు దాడి చేశారని చెప్పారు.
భూ నిర్వాసితుల పైన లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారి పైన చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర డీజీపి ని ఆదేశించాలని బిజెపి విజ్ణప్తి చేసింది.  అదేవిధంగా భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి ,వారి సమస్యలను పరిష్కరించి గౌరవేల్లి,గండిపెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ప్రభుత్వంను ఆదేశించాలని గవర్నర్ ను కోరారు. 
 
మరోవంక, బాసర ట్రిపుల్ ఐటీలో 8 వేల మంది విద్యార్థులు కనీస సౌకర్యాల్లేక అల్లాడుతున్నారని వారు తెలిపారు. భోజనం సరిగా లేదని, పురుగుల అన్నం, నీళ్ల చారు, దొడ్డు బియ్యం పెడుతున్నారని, 8 వేల మందికి ఒకటే భోజనశాల ఉందని,  రేకుల షెడ్లో ఉంటున్నారని, లైబ్రరీలో చదువుకోవడానికి పుస్తకాల్లేవని వివరించారు.