ప్రతిపక్షాల ఐక్యత చాటి చెప్పలేక పోయిన మమతా భేటీ!

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించడం కోసం అంటూ టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిపిన సమావేశంలో ఏకాభిప్రాయంకు రాలేకపోయారు.  పైగా, 2024 జరిగే లోక్‌సభ ఎన్నికలనాటికి ప్రతిపక్షాల ఐక్యతను సాధించే కృషిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు కీలక పార్టీలు హాజరు కాకాపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరలేదని చెప్పవచ్చు. 
 
ముఖ్యంగా మమతకు సన్నిహితులుగా పేరొందిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ సమావేశానికి గైరజరయ్యారు. కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించడం పట్ల అసంతృప్తితో ఆ పార్టీతో వేదిక పంచుకొనే ప్రశ్న లేదని వారు స్పష్టం చేశారు.  ఇక తటస్థంగా వ్యవహరిస్తూ, కీలక సమయాలలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఒడిశా పలకపార్టీ బిజెడి కూడా గైరాజారయింది.
 
సోనియా గాంధీ ఆసుపత్రిలో ఉండడం, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి కీలక నాయకులు హాజరు కాలేదు.  ఈ సమావేశం పట్ల విముఖంగా ఉంటూ వచ్చిన సిపిఎం నుండి సహితం సీనియర్ నేతలు హాజరు కాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ వంటి వారు సహితం హాజరు కాలేదు. 
 
 విపక్షాల తరఫున పవార్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీలన్నీ ముక్త కంఠంతో సమర్థించాయి. అయితే పోటీకి పవార్‌ సున్నితంగా నిరాకరించారు. భేటీ అనంతరం ఈ మేరకు ట్వీట్‌ చేశారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. దానితో మమతా  బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీజీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్లను సూచించినట్లు తెలుస్తోంది.అభ్యర్థిపేరు ఖరారు కోసం ఈ నెల 21న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించాయి. 
 
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో ఎన్‌సీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్; కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేశ్, రణదీప్ సుర్జీవాలా; జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమార స్వామి; సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. 
 
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్‌సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్, ఆర్ఎస్‌పీ, ఐయూఎంఎల్, ఆర్ఎల్‌డీ, జేఎంఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 
ఈ భేటీకి మమతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసిపి, తెలుగు దేశం, ఎంఐఎం పార్టీలకు ఆహ్వానం పంపలేదు.  ఒకవేళ ఆహ్వానం ఇచ్చినా.. ఆ భేటీకి వెళ్లేవాడిని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి స్పష్టం చేశారు.  కాంగ్రెస్‌ను ఆహ్వానించారు కాబట్టే.. ఆ భేటీకి రామని చెప్పేవాళ్లం అంటూ మమతా పార్టీ టీఎంసీ ఇంతకు ముందు తమ పార్టీ (ఎంఐఎం) గురించి చాలా దారుణంగా మాట్లాడిందని, అలాంటప్పుడు ఆమె నిర్వహించే భేటీకి ఎలా హాజరవుతామని ఒవైసీ ప్రశ్నించారు.
విపక్ష నేతలకు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌
మరోవంక, రాష్ట్రపతి ఎన్నికలలో ఏకాభిప్రాయం సాధించేందుకు బిజెపి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్డీయే అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్ధతు ప్రకటించాని కోరుతూ  బీజేపీ  సీనియర్‌ నేత, రక్షణ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ పలువురు ప్రతిపక్ష నేతలకు ఫోన్‌ చేస్తున్నారు.
 
మధ్యాహ్నాం కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గేతో ఫోన్‌లో సంప్రదించిన రాజ్‌నాథ్‌.. సాయంత్రం మమతా బెనర్జీ, అఖిలేష్‌యాదవ్‌తోపాటు మరికొందరితోనూ ఫోన్‌లో మాట్లాడారు. అయితే ప్రతిపక్షాల నుండి సానుకూల స్పందన లేదని జాతీయ మీడియా కధనాలు తెలుపుతున్నాయి. వీరితో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో కూడా రాజనాథ్ సింగ్ టెలిఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. 
మమత భేటీకి టీఆర్‌ఎస్, బీజేడీ, ఆప్‌ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు దూరంగా ఉండటం బీజేపీలో ఉత్సాహం నింపింది. బీజేడీ ఎప్పుడూ విపక్ష శిబిరానికి దూరం పాటిస్తూ వస్తోంది. పలు అంశాలపై ఎన్డీఏకే మద్దతివ్వడం తెలిసిందే. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 48 శాతానికి పైగా ఓట్లున్నాయి.
బీజేడీ తదితరుల మద్దతుతో తమ గెలుపు సునాయాసమేనని బీజేపీ భావిస్తోంది. విపక్ష భేటీలో నేతలంతా తమదే పై చేయి అని నిరూపించుకో చూశారని  పార్టీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేది ఎద్దేవా చేశారు. ఈ భేటీలతో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ ఆయన పెదవి విరిచారు.