బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన పట్ల గవర్నర్ ఆందోళన

సమస్యలను పరిష్కరించాలంటూ నిర్మల్లోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బుధవారం నిర్వహించిన నిరసనలపై గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. జోరువానలోనూ విద్యార్థులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి రావడం తనకు ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.  విద్యార్థులంతా తమ తమ ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలని ఆమె సూచించారు. 
 
తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంతో పాటు జీవిత లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేయాలని ఆమె సూచించా రు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల అంశాన్ని తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ట్విటర్ వేదికగా గవర్నర్  వెల్లడించారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎంవో ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు.  
 
విద్యార్థులకు తాగునీరు నిలిపివేత 
 
మరోవంక, బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అధికారులు త్రాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీంతో నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విధంగా తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది…తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్దరించాలి’’ అని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ట్వీట్ చేశారు. 
 
మరోవైపు బాసర ఆర్జీయూకేటి (ట్రిపుల్ ఐటి) మెయిన్ గేటు వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. 12 డిమాండ్లతో గత మూడు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 
దానితో బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖాళీ వాటర్ బాటిల్స్ తో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. మెయిన్ గేటు ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టడంతో విద్యార్థులు గేటు వైపు దూసుకు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్‌జీయూకేటీ రెండో గేటు ఎదుట విద్యార్థులు బైఠాయించారు. 
మరోవైపు విద్యార్ధులకు మద్దతుగా వస్తున్న తల్లితండ్రులతో సహా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.  ఇంకోవైపు విద్యార్ధుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన టిజెఎస్ అధ్యక్షుడు  కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరసనలు కంటిన్యూ చేస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.
విద్యార్ధులకు మద్దుతు తెలిపేందుకు వస్తున్న నేతల్ని ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ దగ్గర గందగోళ పరిస్థితి నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు బీజేపీ పూర్తి మద్ధతు ఇస్తుందని ఆదిలాబాద్  ఎంపీ సోయం బాపురావు ప్రకటించారు.  బాసరలో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు.
 రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నాని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన  డిమాండ్ చేశారు. కాగా  ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ బాపూరావు  బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్నారు.
 
ఎనిమిది వేల మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి వర్సిటీలో నెలకొన్న సమస్యలపై గొంతెత్తారు. వర్సిటీ ప్రధాన గేటు వద్ద రోజంతా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వర్షంలో తడుస్తూనే  కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేశారు. సీఎం  కేసీఆర్‌ వర్సిటీకి వచ్చి.. సమస్యలు పరిష్కరించేదాక  ఆందోళన ఆపబోమని స్పష్టంచేశారు. 
 
సోషల్‌ మీడియా వేదికగానూ వేల మంది విద్యార్థులు తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ హమీ ఇచ్చినా.. వైస్‌ చాన్సలర్‌తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించినా విద్యార్థులు మాత్రం పట్టు వీడటం లేదు. మాటలు చెప్పొద్దని.. ,తమ సమస్యలకు పరిష్కారం చూపాలని సోషల్‌ మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు ఘాటైన సమాధానాలిచ్చారు.