డీసీపీని నెట్టేసిన భట్టి, ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా.. బిజెపి ఆగ్రహం 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మనీ లాండరింగ్ కేసులో ఈడీ ప్రశ్నిస్తున్నందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్ భవన్ హింసాత్మకంగా మారింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలను రాజ్ భవన్ కు వెళ్లనీయకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీశాయి.
 ఈ నేపథ్యంలో జరిగిన వాగ్వాదాల సమయంలో అక్క‌డ విధుల్లో ఉన్న వెస్ట్ జోన్ డీసీపీ జోయ‌ల్ డేవిస్‌ను భ‌ట్టివిక్ర‌మార్క నెట్టేశారు.మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు. పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి మ‌రీ కొడుతానంటూ బెదిరించారు. అరెస్టు చేసేందుకు యత్నించిన ఖాకీలను రేణుకా చౌదరి ఖబడ్దార్ అంటూ హడలెత్తించారు.
మహిళా నేతలతో వచ్చిన రేణుకను పోలీసులు అడ్డగించారు. అరెస్టు చేసే క్రమంలో ఓ మహిళా పోలీస్ రేణుకను పట్టుకునేందుకు యత్నించారు. అంతే ఆమెపై కన్నెర్ర చేశారు. ‘తనను టచ్ చేస్తే ఖబడ్డార్’ అంటూ హెచ్చరించారు.  అంతటితో ఆగని రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు. నన్నే అరెస్టు చేస్తారా? అంటూ ఆమె రచ్చ రచ్చ చేశారు. రేణుకా తీరుతో ఒకింత భయపడ్డారు. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
అంతకు ముందు, రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 
 
ఈ లొల్లి ఏమిటి? బిజెపి ఆగ్రహం 
కాంగ్రెస్ వారి హింసాత్మక నిరసన పట్ల బిజెపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో ఈడీ నోటీసులిస్తే ఈ లొల్లి ఏంది? అని బీజేపీ సీనియర్ నేత, తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.  తప్పు చేశామని కాంగ్రెసోళ్లే అనుకుంటున్నరు. అందుకే ముందే గాయిగాయి చేస్తే వదిలేస్తరనుకుంటున్నరు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విధ్వంసం స్రుష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఖైరతాబాద్ లో కాంగ్రెసోళ్లు చేసిన విధ్వంసం దారుణం అంటూ ఖండించారు. వీళ్ల కేసుకు సంబంధించిన అంశానికి, సాధారణ ప్రజలకు ఏం సంబంధం? తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? ఆర్టీసీ బస్సులకు ఏం సంబంధం? అంటూ నిలదీశారు. ఈ కేసు కొత్తగా పెట్టింది కాదని, 12 ఏళ్ల కిందటి కేసు అని ఆయన గుర్తు చేశారు.
రోడ్డు మీద పోయే సామాన్య ప్రజల ద్విచక్రవాహనాలను తగలబెడతారా? ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తారా? అంటూ నిలదీశారు. నిన్నటే మా తడాఖా చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తే పోలీసులు ఏం చేసినట్లు? ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.  అంటే కాంగ్రెస్, టీఆర్ఎసోళ్లు ఇద్దరు కలిసి బీజేపీని బదనాం చేసేందుకు ఇదో కొత్త డ్రామా షురూ.. చేశారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పక్కా దోస్తీ ఉందని చెబుతూ వారిద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నరని స్పష్టం చేశారు. కాంగ్రెసోళ్లు 50 ఏళ్లకుపైగా దేశాన్ని పాలించారు. చట్టాన్ని గౌరవించడం తెల్వదా? ఈడీ, సీబీఐ అధికారులు వాళ్ల డ్యూటీ చేయొద్దా?  అంటూ ప్రశ్నించారు.
 
 గతంలో మోదీపై కేసులు పెట్టారు. విచారణ చేశారు. అమిత్ షాను జైళ్లో పెట్టారు. అద్వానీపై కేసులు పెట్టారు. మీలాగా చేతగానోని లెక్క రోడ్ల మీదకొచ్చి లొల్లి పెట్టినమా? అంటూ ఆయన కాంగ్రెస్ ధోరణిపై మండిపడ్డారు.
 
 తెలంగాణలో త్వరలో కాషాయ జెండా ఎగరేయబోతుందని కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలకు వణుకుపుట్టి విధ్వంసాలకు పాల్పడుతున్నారని రెడ్డి విమర్శించారు. బీజేపీని బదనాం చేసేందుకు పెద్ద పెద్ద కుట్రలు చేయబోతున్నారని ఆయన తెలిపారు.