వివాదంలో నటి సాయిపల్లవి.. సుల్తాన్ బజార్ పీఎస్ లో ఫిర్యాదు

టాలీవుడ్‌లో ఇప్పటివరకూ వివాదాలకు దూరంగా ఉన్న నటి సాయి పల్లవి తాజాగా అనాలోచితంగా చేసిన వాఖ్యలు ఆమెను వివాదంలోకి నెట్టాయి. ఆమె నటించిన తాజా చిత్రం ‘విరాట పర్వం’ మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వ్యక్తం చేసిన అభిప్రాయం వివాదానికి తెరలేపింది.
 సాయిపల్లవి వ్యక్తం చేసిన అభిప్రాయంపై  పలువురు   విభేదించడంతో  ఆమె చిక్కుల్లో పడింది. గో ప్రేమికులను కశ్మీర్‌ ఉగ్రవాదులతో ఆమె పోల్చారని సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు భజరంగ్ దళ్‌ ఫిర్యాదు చేసింది.
 
‘‘కొన్ని రోజుల ముందు వచ్చిన కశ్మీరీ ఫైల్స్ చిత్రంలో ఆ సమయంలో  అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ను ఎట్లా చంపారనేది చూపించారు కదా. … ఈ మధ్య కరోనా సమయంలో ఎవరో ఒక బండిలో  గోవును తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసే అతను ముస్లింగా ఉన్నారు. కొందరు జనాలు కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారా. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా  ఎక్కడ ఉంది..?” అంటూ ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. 
 
 “కాబట్టి ఇప్పుడు మనం మతం పేరులో  మంచిగా ఉండాలి. మనం మంచి వ్యక్తిగా ఉండి ఉంటే ఎవ్వరిని గాయపరచం…  ఒక వ్యక్తిపైన ఆ వత్తిడి పెట్టం’’ అని సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే.. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని ఆమెపై మండిపడుతున్నారు.
ఎవరో ఒక ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడికి, ఒక మొత్తం సమూహంపై జరిగిన నరమేధానికి చాలా తేడా ఉందని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. మా బాధను చిన్నచూపు చూడొద్దంటూ ట్వీట్ చేశారు. ఒకసారి వచ్చి పగిలిన మా గుండెలను, ధ్వంసమైన మా ఇళ్లను సాయిపల్లవి చూడాలని, ఆ నరమేధానికి మిగిలిన సజీవ సాక్ష్యాలం తామేనని ఒక నెటిజన్ ట్వీట్ చేయడం గమనార్హం.
విరాటపర్వం చిత్రంలో ఓకే నక్సలైట్ నాయకుడి ప్రియురాలిగా నటించిన ఆమెను వామపక్ష తీవ్రవాద సిద్దాంతం గురించి అడిగినపుడూ తనకే సిద్దాంతం లేదని, తాను `మధ్యస్థురాలిని’ అని చెబుతూ చిత్రం కదా జరిగిన సమయంలో వారి సిద్దాంతం (హింస) సరైనదే అనిపిస్తుందని, అయితే తనకు హింసను ఒప్పుకోనని అంటూ అసందర్భంగా కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రసక్తిని ఆమె తీసుకొచ్చారు.
నక్సల్స్ యూనిఫామ్ ధరించినప్పుడు ఏమనిపించిందని అడిగితే “అదొక్క సిద్ధాంతం…. మనకు శాంతి సిద్ధాంతంగా ఉండాలి. అభిప్రాయం వ్యక్తీకరణకు హింస తప్పుడు మార్గం అని నేను భావిస్తాను. అయితే ఈ సినిమా కధనం జరిగిన సమయంలో తమ ఇబ్బందులు వ్యక్తం చేయడానికి వారికి (నక్సల్స్) అదే (హింస) సరైన మార్గమని తోచి ఉండవచ్చు” అని ఆమె చెప్పుకొచ్చారు.
“వారొక బృందంగా (నక్సల్స్) ఏర్పడి, తాము చెప్పిందే, చేసెడిదే సరైన మార్గం అనే అభిప్రాయంలో ఉన్నారు. వారికి మంచి మార్గమా? కాదా? మనం వారి పరిస్థితులలో లేము గదా. అదొక్క భిన్నమైన సమయం. నేను ఇదివరకు చెప్పిన్నట్లు మన సైనికులు చేసెడిది పాకిస్థాన్ వారికి ఉగ్రవాద చర్యగా ఉంటుంది. ఎందుకంటె అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది. అదే విధంగా మనకు వారు (పాక్ సైనికులు) చేసిదిది అదే విధంగా కనిపిస్తుంది. ఇదంతా ద్రుక్పదంను బట్టి ఉంటుంది” అంటూ ఓ తీరు తెన్నూ లేకుండా ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొంటూ వచ్చారు.