హత్యలు, అత్యాచారాల అడ్డగా తెలంగాణ

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాల్జేసి అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. 
 
ప్రధాని నరేంద్ర మోదీ  8 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్బంగా సేవ, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం  రాత్రి మేడ్చల్ నియోజకవర్గంలోని జవహార్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ  హత్యలు, అత్యాచారాలకు అడ్డగా తెలంగాణను మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు ముమ్మాటికీ గ్లోబరీనా సంస్థే కారణమని స్పష్టం చేశారు. గ్లోబరీనా సంస్థ బండారాన్ని కోర్టుల ముందుంచి బయటపెడతామని హెచ్చరించారు.  టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దోపిడీలకు అంతు లేకుండా పోతోందని చెబుతూ భూములు కబ్జా చేస్తరు.. మార్కెట్ యార్డుల పేరిట దోచుకుంటున్నరని ఆరోపించారు.
 
కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్ను, నల్లా పన్నులుసహా అన్ని పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్న సీఎం కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేసినవని అడిగితే కేంద్రాన్ని బదనాం చేస్తున్నాడని మండిపడ్డారు. 
 
 కొట్లాడి తెలంగాణ సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పులు పాల్జేశారని అంటూ తెలంగాణను ఆదుకోవడానికి, నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా… రాజకీయం చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్నారే తప్ప అభివ్రుద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని విమర్శించారు. 
 
17 లక్షల రేషన్ కార్డులను తొలగించి పేదల ఉసురుపోసుకుంటున్నడని, పెన్షన్లు తీసేస్తున్నడు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.  ప్రజలారా…. మీ ఎమ్మెల్యే వస్తే… ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో… రేషన్ కార్డులు ఎందుకు తొలగించారో… ఇండ్లు ఎందుకు కట్టివ్వడం లేదో నిలదీయండి అంటూ సంజయ్ పిలుపిచ్చారు. 
 
తెలంగాణ సాధించుకున్నది కబ్జాలు, దోపిడీలు, అత్యాచారాల కోసమేనా…. వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రావడానికా? అని ప్రశ్నించారు.  ఎక్కడ హత్య, అత్యాచారం జరిగినా ఎంఐఎం, టీఆర్ఎస్ హస్తం ఉంటోందని సంజయ్ ఆరోపించారు. హత్యలు, అత్యాచారాల కోసం రెండు పార్టీల నేతల పోటీ పడుతున్నరని ఎద్దేవా చేశారు.
మంథని, ఖమ్మం, రామాయంపేట, నిర్మల్, కోదాడ, వనస్థలిపురం సహా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అత్యాచారాలు జరిగినా ఆ రెండు పార్టీల భాగస్వామ్యమే ఉందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం అనుకోకుండా జరిగింది కానేకాదని, ఓ పథకం ప్రకారం చేసారని తెలిపారు.  28న ఘటన జరిగితే బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ను ముట్టడించే వరకు కేసు పెట్టలేదని గుర్తు చేశారు. 
 
తెలంగాణలో హిందూ సమాజానికి బీజేపీ అండగా లేకపోతే హిందువుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలని కోరారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకులకు టీఆర్ఎస్ నేతలు, సీఎం దాసోహమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణాలో ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని సంజయ్ విమర్శించారు.  గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారని గుర్తు చేసారు. వాళ్లేమైనా ఉగ్రవాదులాలా? అర్ధరాత్రి ఇండ్లల్లొకి చొరబడి రక్తం చిందేలా పోలీసులతో కొట్టిస్తారా?  అని ప్రశ్నించారు.