కువైట్‌ లో నిరసనల్లో పాల్గొన్న ప్రవాసుల అరెస్టు, దేశ బహిష్కరణ

మహ్మద్‌ ప్రవక్తను కించపరిచేలా బిజెపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న భారతీయులతో సహా  ప్రవాసులుఅందరిని  అరెస్టు చేయాలని, వారిని బహిష్కరించాలని కువైట్‌ ప్రభుత్వం నిర్ణయించింది.  ఇటువంటి ప్రదర్శనలను కువైట్‌ చట్టాలు అనుమతించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
మహ్మద్‌ ప్రవక్తకు మద్దతుగా శుక్రవారం నాటి ప్రార్ధనల అనంతరం ప్రదర్శనలు నిర్వహించిన ఫహహీల్‌ ఏరియాలోని ప్రవాసులను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని సౌదీ అరేబియా నుండి ప్రచురితమయ్యే అరబ్‌న్యూస్‌ వార్తాపత్రిక పేర్కొంది.
 
 ప్రవాసులు ఇక్కడకు వచ్చి ఇటువంటి ధర్నాలు లేదా ప్రదర్శనలు నిర్వహించరాదని, ఈ దేశ చట్టాలను, నిబంధనలను వారు ఉల్లంఘించినందున నిరసన ప్రదర్శకులను వారి దేశాలకు పంపివేస్తామని కువైట్‌ ప్రభుత్వం తెలిపింది. 
 
వీరిని గుర్తించి, అరెస్టు చేసే క్రమంలో వున్నారని, ఆ తర్వాత వారిని ఆయా దేశాలకు పంపిన తర్వాత మరోసారి వారు కువైట్‌ రాకుండా నిషేధిస్తారని కువైట్‌ వార్తాపత్రిక తెలిపింది.  కువైట్‌లో నివసించే ప్రవాసులందరూ ఆ దేశ చట్టాలను గౌరవించాల్సిందే, ఎలాంటి ప్రదర్శనల్లో పాల్గొనరాదు.
కువైట్‌లో భారత రాయబారి సిబి జార్జిని పిలిచి అధికార నిరసన పత్రాన్ని అందజేసినట్లు కువైట్‌ విదేశాంగ శాఖ తెలిపింది. కువైట్‌లో చట్టబద్ధంగా నివసించే భారతీయుల సంఖ్య పది లక్షలు దాటిపోయిందని తాజా గణాంకాలు తెలుపుతున్నాయి. నిరసన ప్రదర్శనలలో పాల్గొన్న భారతీయులు ఆ దేశ చట్టప్రకారం శిక్షలకు గురికావలసిందే అని, ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం సహితం ఏమీ చేయలేకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.