ఇరాన్ కారిడార్ ద్వారా రష్యా – భారత్ సరుకుల రవాణా

తమ దేశంలోని నూతన వాణిజ్య కారిడార్‌ ద్వారా రష్యా నుండి భారత్‌కు సరుకుల రవాణాను ప్రారంభించినట్లు ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ న్యూస్‌ ఏజన్సీ (ఐఆర్‌ఎన్‌ఎ) తెలిపింది. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ అనే దేశీయ షిప్పింగ్‌ లైన్స్‌ గ్రూప్‌ మొదటి సారి ఈ కారిడార్‌ ద్వారా రవాణా చేస్తున్నట్లు పేర్కొంది. 
 
ఈ వాణిజ్య కారిడార్‌ను పరిశీలించేందుకు ప్రారంభించిన పైలెట్‌ పథకంగా ఇరాన్‌ పోర్ట్‌ అధికారులు తెలిపారు. రష్యన్‌ కార్గోలో 41 టన్నుల బరువు, 40 అడుగుల వుడ్‌ లామినేటెడ్‌ షీట్‌లతో కూడిన రెండు కంటైనర్‌లు ఉన్నాయి. ఇవి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ నుండి కాస్పియన్‌ సముద్ర ఓడరేవు నగరమైన ఆస్ట్రాఖాన్‌కు బయలు దేరినట్లు ఇండియన్‌-రష్యన్‌ టెర్మినల్‌ డైరెక్టర్‌ దైరుష్‌ జమాలి తెలిపారు. 
 
అయితే షిప్‌ ఎప్పుడు చేరనుంది, అందులోని వస్తువుల వివరాల గురించి సమాచారమివ్వలేదు. ఆస్ట్రాఖాన్‌ నుండి కార్గో ఉత్తర ఇరానియన్‌ ఓడరేవు అంజలికి చేరుకుంటుందని, అక్కడి నుండి పర్షియన్‌ గల్ఫ్‌లోని దక్షిణ ఓడరేవు అబ్బాస్‌కు రోడ్డు మార్గంలో వెళ్లనుందని, అనంతరం ఓడలో భారత నౌకాశ్రయమైన నవాషెవాకు పంపుతామనిపేర్కొన్నారు. 
 
ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ షిప్పింగ్‌ లైన్స్‌ గ్రూప్‌, రష్యా , భారత్‌లోని ప్రాంతీయ కార్యాలయాలు సంయుక్తంగా ఈ రవాణాను పరిశీలిస్తాయని, 25 రోజుల సమయం పట్టవచ్చని చెప్పారు. 
 
ఆసియా ఎగుమతి మార్కెట్‌లను లింక్‌ చేయడానికి తమ దేశం ద్వారా ఉత్తర -దక్షిణ రవాణా కారిడార్‌ అభివృద్ధి కోసం సంబంధిత ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ఇరాన్‌ యత్నిస్తోందని అధికారులు తెలిపారు. ఇరానియన్‌ కాస్పియన్‌ సముద్ర ఓడరేవుకు వచ్చే సరుకులను ఆగేయ నౌకాశ్రయమైన చాబహార్‌కు చేర్చేందేకు ఒక రైలు మార్గాన్ని నిర్మించాలని యోచిస్తోంది.