రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చలు జరుపనున్న రాజనాథ్, జెపి నడ్డా 

రాష్ట్రపతి ఎన్నికలలో ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు, యుపిఎ పక్షాలు, ఇతర ప్రతిపక్షాలు, స్వతంత్రులతో చర్చలు జరిపేందుకు బిజెపి కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డలను నియమించింది. ఏకాభిప్రాయం ద్వారా రాష్ట్రపతి అభ్యర్థిని నిన్ఱాయించేందుకు వీరు ప్రయత్నం చేయనున్నారు.
ఈ నాయకులిద్దరు అధికార కూటమి, ప్రతిపక్షాలలో రాజకీయ పార్టలతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కూడా చర్చలు జరుపుతారని బిజెపి ప్రకటించింది. జూన్ 15 తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. 
 
రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ బరిలో దిగడం తెలిసిందే.
మరోవంక, సొంతంగా అభ్యర్థిని గెలిపించుకోలేని ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం కోసం కసరత్తు ప్రారంభించాయి. ఒక వంక సోనియా గాంధీ, మరోవంక మమతా బెనర్జీ ఈ విషయమై తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై సోనియా గాంధీ ఆదేశంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఇప్పటికే కొందరు ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది.
4,809 ఓట్ల విలువగల ఎంపీలు, ఎమ్యెల్యేలు ఓట్ వేయనున్న ఈ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లభించే అవకాశం ఉంది. అయితే అందరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక కోసం బిజెపి కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.