పంచాయతీలను సాధికారం చేయడంలో కొత్త మైలురాళ్లు

గడచిన ఎనిమిదేళ్ళలో గ్రామ స్వరాజ్య సాధనలో, ప్రజాస్వామ్యయుతంగా పంచాయతీలను సాధికారం చేయడంలో నూతన మైలురాళ్ళను అధిగమించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంక్షేమ పథకాలు సంతృప్తికర స్థాయిలో అందరికీ అందేవిధంగా, నీటిని పరిరక్షించే విధంగా కృషి చేయాలని పంచాయతీ సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. 
 
అంతర్జాతీయ యోగా దినోత్సవాలను రికార్డు స్థాయిలో నిర్వహించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశంలోని సర్పంచ్‌లకు ఆయన ఓ లేఖ రాశారు.
ఈ ఎనిమిదేళ్ళలో సర్పంచ్‌లు చేసిన కృషిని ప్రశంసించారు. జల సంరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటివాటికి సహకరించాలని కోరారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేవిధంగా అందరినీ ప్రోత్సహించాలని కోరారు. ఈ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు లభించేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఏదైనా ప్రముఖ ప్రాచీన ప్రదేశాన్ని లేదా ఓ ప్రముఖ యాత్రా స్థలాన్ని లేదా గ్రామంలోని చెరువు వంటి ప్రదేశానికి పక్కన యోగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయాలని కోరారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చాలా ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొంటారని ప్రధాని గుర్తు చేశారు. అన్ని దిక్కులు, ఆకాశం, హిమాలయాలు, సముద్రంలో యోగా చేస్తూ ఫొటోలను గతంలో షేర్ చేశారని, ఇది భారతీయులకు గర్వకారణమని చెప్పారు.
ఈసారి యోగా దినోత్సవాలు ‘యోగా ఫర్ హ్యూమనిటీ’ (మానవత్వం కోసం యోగా) ఇతివృత్తంతో జరుగుతున్నట్లు ప్రధాని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా జీవితంలో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించారని సూచించారు.  ప్రతి నీటి చుక్కను కాపాడుకోవలసిన అవసరం ఉందని మోదీ తెలిపారు. నీటి పరిరక్షణ చర్యలను సమర్థవంతంగా, కలిసికట్టుగా చేపట్టాలని మోదీ ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. వర్షపు నీటిని పరిరక్షించాలని కూడా చెప్పారు.
ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రతి జిల్లాలోనూ  75 అమృత్ సరోవరాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసేందుకు కృషి చేయాలని సర్పంచ్‌లను మోదీ కోరారు. అర్హులందరూ  ప్రభుత్వ పథకాల లబ్ధిని సంపూర్ణంగా  పొందితే, గ్రామంతోపాటు యావత్తు దేశం సౌభాగ్యవంతం అవుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని శ్రద్ధగా కొనసాగించాలని తెలిపారు. ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.