థానే పోలీసుల ముందు హాజరుకు సమయం కోరిన నూపుర్ శర్మ

మమహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ముంబై పోలీసుల ముందు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని బీజేపీ సస్పెండెడ్ ప్రతినిధి నూపర్ శర్మ కోరారు. షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రలోని బివాండీ పోలీసుల ముందు సోమవారంనాడు ఆమె హాజరు కావాల్సి ఉంది.
అయితే తనకు మరింత గడువు ఇవ్వాలని నూపుర్ శర్మ కోరినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. శర్మ విజ్ఞప్తిని అంగీకరించామని ఆయన చెప్పారు. ఎంతవరకు ఆమెకు గడువు ఇచ్చారనేది మాత్రం  వెల్లడించలేదు. టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్తపై నూపర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గాను రజా అకాడమీ ప్రతినిధి ఒకరు మే 30న ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నూపర్‌ శర్మ స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు సమన్లు పంపారు.  ప్రవక్తపై ట్వీట్లు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నవీన్ కుమార్ జిందాల్‌కు కూడా ముంబై పోలీసులు సమన్లు పంపారు. ఈనెల 15న ఆయన థానే పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది.

కోల్‌కత పోలీసుల సమన్లు

కాగా, తాజాగా  నుపూర్ శర్మకు కోల్‌కత పోలీసులు సమన్లు జారీచేశారు. నుపూర్ శర్మపై నార్కదంగ పోలీసు స్టేషన్‌లో ఒక ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. నుపూర్ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఈ నెల 20న పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు ఆమెకు సమన్లు జారీచేశారు. ఆమె వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి అబుల్ సోహెల్ కూడా కొంతాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.